దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా ఆదివారం బంగ్లా-భారత్ మధ్య అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యువ టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే తొలిసారి వరల్డ్‌కప్ అందుకున్న బంగ్లా జట్టు... మనసులు మాత్రం గెలవలేకపోయింది. వివాదస్పద సంబరాలు చేసుకొని భారత ఆటగాళ్లపై మాటల యుద్ధానికి దిగింది. ఫలితంగా ఇరుజట్లు కొట్టుకునేంతకు దారి తీసింది పరిస్థితి.
తాజాగా బంగ్లాదేశ్ జట్టు తీరుపై భారత సారథి ప్రియమ్‌గార్గ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు శ్రుతి మించి ప్రవర్తించారని, చెత్తగా సంబరాలు చేసుకొన్నారని భారత సారథి అన్నాడు.
" మ్యాచ్ అయిపోయాక మేం సాధారణంగానే ఉన్నాం. ఆటలో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ క్రీడలో భాగమని భావించాం. అయితే ప్రత్యర్థుల గెలుపు సంబరాలు చెత్తగా ఉన్నాయి. అలా జరగకూడదు"
-- ప్రియమ్‌గార్గ్, భారత కెప్టెన్
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లపై.. ఆరంభం నుంచే మాటల దాడికి దిగారు బంగ్లా ఆటగాళ్లు. భారత బ్యాట్స్‌మెన్‌ను అదే పనిగా కవ్వించారు. పేసర్ షొరిఫుల్ ఇస్లామ్ ప్రతి బంతికీ బ్యాట్స్‌మెన్‌ను తిడుతూ కనిపించాడు. విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను చూస్తూ వెకిలిగా సంజ్ఞలు చేశారు. అంతేకాకుండా భారత కుర్రాళ్ల దగ్గరికి వచ్చి హేళన చేశారు. ఫలితంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకొంది.