పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు ఊరట లభించింది. అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని సగానికి కుదిస్తూ స్వతంత్ర్య న్యాయ నిర్ణేత, పాకిస్థాన్ మాజీ సుప్రీం కోర్టు జడ్జి ఫకిర్ మహమ్మద్ ఖోఖర్ తీర్పు వెల్లడించారు. రెండు వేర్వేరు సందర్భాల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక చట్టాన్ని వికెట్ కీపర్ ఉల్లంఘించాడంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, జస్టిస్ ఫజల్-ఇ-మిరాన్ చౌహాన్ ఈ ఏడాది ఏప్రిల్ 27న అక్మల్‌పై నిషేధం విధించారు.
పాక్ ప్రముఖ క్రికెటర్‌పై నిషేధం సగానికి కుదింపు - పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ వార్తలు
క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఉన్న నిషేధాన్ని సగానికి కుదించారు. ఈ నిర్ణయంపై సంతృప్తి చెందని ఇతడు.. మరిన్ని ప్రయత్నాలు చేస్తానని అన్నాడు.
తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ అక్మల్ మే 19న అప్పీలు దాఖలు చేశాడు. స్పందించిన న్యాయ నిర్ణేత అతడిపై సగం శిక్షను తగ్గించి నిషేధాన్ని 18 నెలలకు కుదించారు. అక్మల్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై సంతృప్తి చెందని ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ శిక్షను తగ్గించుకునేదుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నాడు.
'నా లాయర్ వాదనలు విన్నందుకు న్యాయమూర్తికి ధన్యవాదాలు. ఈ తీర్పుతో సంతృప్తిగా లేను. శిక్షను తగ్గించుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇందుకు నా లాయర్, కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటా' అని ఉమర్ అన్నాడు. 'నా కంటే ముందు ఎందరో ఆటగాళ్లు తప్పులు చేశారు. వారందరికి చిన్న శిక్ష వేశారు. కానీ నాకు మాత్రం పెద్ద శిక్ష వేశారు' అని తెలిపాడు.