అండర్-19 ప్రపంచకప్ మిగతా వాటిలా కాదు. దీంతో ఆటగాళ్లకే కాకుండా అభిమానులకూ భావోద్వేగ బంధం ఏమీ లేదు. సీనియర్ స్థాయి ప్రపంచకప్ లాగా ఇదేమీ అపురూపం కాదు! సీనియర్ స్థాయిలో ఏళ్ల తరబడి ఒకే జట్టులా కాకుండా.. ప్రతి రెండేళ్లకూ జరిగే ఈ టోర్నీలో ఎప్పటికప్పుడు కొత్త జట్టు తయారువుతోంది. ఆ జట్టులోని ఆటగాళ్లూ కొన్ని నెలల ముందు అందులో చేరి, కొన్ని సిరీస్‌లు ఆడి ప్రపంచకప్‌కు వస్తారు. గెలిచాక ఎవరి దారి వారిది! ఏడాది తర్వాత కొత్త జట్టు ఏర్పాటవుతుంది. ఈ ప్రపంచకప్‌లో టైటిల్ గెలిస్తే అది బోనస్. అంతకంటే ముందు కుర్రాళ్లు జట్టుగా మారాక ప్రపంచకప్ వరకు సాగించే ప్రయాణంలో ఎలా పరిణితి సాధించారు.. ఏ విధంగా ప్రతిభ చాటుకున్నారనేది కీలకాంశం. ఈ విషయంలో గార్గ్ సేన మార్కులు కొట్టేసింది.
ప్రతి అండర్-19 ప్రపంచకప్‌లో యువ ప్రతిభ ఏమేర వెలుగులోకి వచ్చిందనే విషయాన్ని అందరూ దృష్టిసారిస్తారు. యువరాజ్, రోహిత్, కోహ్లి, జడేజా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్.. ఇలా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చింది ఈ టోర్నీతోనే. మరి ఈసారి ఈ టోర్నీ భారత్ క్రికెట్ కోసం యువ కిశోరాల్ని అందించిందా అంటే.. కచ్చితంగా ఔననే చెప్పాలి.
వీళ్లలో కోహ్లీలెవరో!
యశస్వి జైశ్వాల్.. ప్రపంచకప్ సందర్భంగా మార్మోగిన పేరు. ఇన్నాళ్లూ అందరూ అతడి నేపథ్యం గురించే మాట్లాడేవాళ్లు. కానీ దాన్ని మించి ఇప్పుడు ఆట గురించి మాట్లాడుకునేలా చేశాడు. టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ద ప్రపంచకప్' అవార్డు గెలిచాడు. యశస్వి ప్రదర్శన, పరిణతి చూస్తే అతను త్వరలోనే టీమ్‌ఇండియా తలుపు తట్టేలా ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో ఇదే స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆటగాడు రవి బిష్ణోయ్. ఫైనల్ సందర్భంగా అతడి మెరుపుల్ని అందరూ చూశారు. టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడతనే. ఇదే నిలకడ కొనసాగిస్తూ, బౌలింగ్‌కు మరింత పదును పెట్టుకుంటే అతడ్ని జాతీయ జట్టులో చూసే అవకాశం ఉంటుంది.
వికెట్ కీపర్ జురెల్ రూపంలో మరో ఆణిముత్యం కనిపించాడు టోర్నీలో. వికెట్ల వెనుక అతడి చురుకుదనం చూసి ముగ్ధులవని వాళ్లు లేరు. టోర్నీలో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా.. కెప్టెన్ ప్రియమ్ గార్గ్ తక్కువేం కాదు. వీరితో పాటు ఫాస్ట్‌బౌలర్లు కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్.. స్పిన్నర్ అంకోలేకర్ టోర్నీలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. ఈ కుర్రాళ్లు ఫైనల్లో చేసింది 177 పరుగులే అయినా.. వాటిని కాపాడుకోవడానికి గొప్పగా పోరాడారు. త్రుటిలో విజయం చేజారినా నిబ్బరంగా నిలబడ్డారు. మరి ఈ యువ జట్టు నుంచి ఎవరు తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకుని తర్వాతి తరం ఆటగాళ్లవుతారో చూడాలి!