ప్రపంచ క్రికెట్లో 'ది వాల్' అనే బిరుదు తెచ్చుకున్న టీమిండియా ఆటగాడు రాహుల్ ద్రవిడ్. భారత జట్టుకు సారథిగా పనిచేసిన ఇతడు.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎందరో ఆటగాళ్లను టీమిండియాలోకి తెచ్చేందుకు కృషి చేస్తోన్న ఈ మాజీ క్రికెటర్ కొడుకు సమిత్ క్రికెట్లో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం అండర్-14లో అదరగొడుతున్నాడు.
ఆల్‌రౌండర్‌గా జూనియర్...
ప్రస్తుతం రాష్ట్రస్థాయిలోని అండర్-14లో ఆడుతోన్న సమిత్.. తండ్రి లాగే ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ చిన్నోడికి కాస్త దూకుడెక్కువ. తండ్రి నెమ్మదిగా ఆడి పేరు తెచ్చుకుంటే ఈ బుడ్డోడు మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.
రాహుల్ ద్రవిడ్-సమిత్ ద్రవిడ్ తాజాగా బెంగళూరులో ధార్వాడ్ జోన్‌తో ఆడిన మ్యాచ్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరఫున తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేశాడు సమిత్. ఈ స్కోరును 256 బంతుల్లోనే సాధించాడు. వీటిలో 22 ఫోర్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లోనూ 94 రన్స్‌తో అజేయంగా నిలిచాడీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. బంతితోనూ రాణించగల సత్తా ఇతడి సొంతం. ఈ మ్యాచ్‌లో 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే చివరికి ఆట డ్రాగా ముగిసింది.
బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా..
గతేడాది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బీటీఆర్ కప్ అండర్-14 ఇంటర్ స్కూల్ టోర్నీలో సమిత్ సెంచరీ (150) కొట్టి అందర్నీ ఆకట్టుకున్నాడు. అండర్-12లోనూ ద్రవిడ్ వారసుడు పరుగుల వరద పారించాడు. ఈ టోర్నమెంటులో మూడు అర్ధశతకాలు సాధించి బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా అవార్డునూ సొంతం చేసుకున్నాడు.