భారతదేశం నుంచి ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్ ప్రపంచానికి పరిచయమయ్యారు. వీరంతా స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా, అదరగొడుతూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు ప్రస్తుతం ఉన్న కోహ్లీ, రహానే, పుజారాలు టెస్టుల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీ ఎవరు? వారు ఎంతెంత నెలకొల్పారో ఇందులో తెలుసుకుందాం.
413-పంకజ్ రాయ్-వినోద్ మన్కడ్ (1956)
క్రికెట్లో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న భారత జట్టు తరఫున, 1956లో ఓపెనర్లు వినోద్ మన్కడ్, పంజక్ రాయ్‌లు సువర్ణ అధ్యాయం లిఖించారు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో జోడీగా 413 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. మద్రాస్ (ప్రస్తుతం చెన్నై) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వినోద్ 231, పంకజ్ 173 పరుగులు చేశారు. 52 ఏళ్ల తర్వాత (2008లో) దక్షిణాఫ్రికా ఓపెనర్లు గ్రేమ్ స్మిత్, నీల్ మెకంజీ ఈ రికార్డును తిరగరాశారు.
410-వీరేంద్ర సెహ్వాగ్-రాహుల్ ద్రవిడ్ (2006)
క్రికెట్ చరిత్రలోని అత్యుత్తమ ఓపెనర్లలో వీరందర్ సెహ్వాగ్ ఒకడు. ఇతడి దూకుడైన ఆటతీరుతో మ్యాచ్ గమనమే మారిపోయేది. టెస్టుల్లోనూ సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడి సత్తాచాటాడు. ఇతడు నెలకొల్పిన భాగస్వామ్యాల్లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సాధించిన 410 పరుగుల్ని క్రికెట్ అభిమానులు అంత తొందరగా మర్చిపోలేరు. 2006లో పాకిస్థాన్‌తో లాహోర్‌లో ఈ మ్యాచ్‌లో ఈ జంట.. ప్రత్యర్థి జట్టు తమ బ్యాటింగ్‌తో ముప్పతిప్పలు పెట్టింది. సెహ్వాగ్ 254, ద్రవిడ్ 128 పరుగులతో ఆకట్టుకున్నారు.