టీమ్‌ఇండియా నయా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తనతో చీవాట్లు పెట్టించుకోవాలంటే ఇష్టమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. తాజాగా ఆయన రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం వెల్లడించాడు. సిరాజ్ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకముందే పరిచయం ఉందని, హైదరాబాద్ జట్టుకు తాను బౌలింగ్ కోచ్‌గా ఉన్నప్పటి నుంచే తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని భరత్ పేర్కొన్నాడు.
"సిరాజ్ కొన్నిసార్లు ప్రణాళికలకు దూరంగా బంతులేస్తాడు. అలాంటప్పుడు అతడిని కోపగించుకుంటాను. అది అతడిని బాధపెట్టడం కాదు కానీ, అర్థమయ్యేలా చెప్పడం. నేను అలా చీవాట్లు పెడితే అతడికి ఇష్టం. నేను కోప్పడినప్పుడు సిరాజ్ నవ్వి, 'ఓకే సర్, ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేస్తా' అని అంటాడు. తర్వాత అతడు హైదరాబాద్ తరఫున రాణించి ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, నేను టీమ్‌ఇండియాకు వచ్చాక తరచూ నాతో మాట్లాడేవాడు. 'నన్నెందుకు పిలవట్లేదు. నేను టీమ్‌ఇండియాకు ఆడాలనుకుంటున్నా' అని నాతో అనేవాడు" అని భరత్ అరుణ్ సిరాజ్ గురించి వివరించారు.
కాగా, సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు అందరీ ప్రశంసలు పొందాడు. గబ్బా టెస్టులో 5 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.