మహమ్మారి కబుర్లతో విసిగివేసారి పోయిన మనస్సులకు ఆటల్లో ఉండే మజాను పరిచయం చేసింది ఐపీఎల్. వాస్తవానికి దాని పేరు ఇండియన్ ప్రీమియర్ లీగ్. కానీ, పరిస్థితుల ప్రభావంతో ఎడారి దేశాన్ని వేదికగా చేసుకుని.. ఒయాసిస్‌లా జీవం పోసింది. ఎన్ని మ్యాచ్‌లు.. ఎన్ని మలుపులు.. ఎన్నెన్ని పోరాటాలు. నరాలను స్ట్రింగ్స్లా మార్చి వయొలిన్, గిటార్ ఏకకాలంలో ప్లే చేస్తే ఎలా ఉంటుందో అలా సాగాయి చాలా మ్యాచ్‌లు.
ఇదే ది బెస్ట్..
అసలు ఓ రోజు, ఓ మ్యాచ్‌లో ఓ సూపర్ ఓవర్ చూడటమే ఎక్కువ అనుకుంటే రెండు, మూడు అంటూ నెంబర్లు పెంచుకుంటూ సూపర్ ఓవర్లే మ్యాచ్ల్లా తయారవుతుంటే ఏ క్రికెట్ ప్రేమికుడు కుదురుగా కూర్చోగలడు? సీనియర్లు తమ అనుభవాన్ని రంగరిస్తూ జట్లకు వెన్నెముకలా మారితే..జూనియర్లు సాహసమే శ్వాస అన్నట్లు చెలరేగిపోయారు. ఇక ఈ పోరాటాలకు అడ్డుకట్ట పడేది ఎక్కడ? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ సీజనల్లో ఇదే ఉత్తమమైందని అభివర్ణించవచ్చు.
అందుకే ముంబయికి..
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. టోర్నీ మొత్తంలో నిలకడగా ఆడిన ఏకైక జట్టు. అందుకే.. రోహిత్ సేన దిగ్విజయంగా ఐదో సారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కానీ, అదే సమయంలో కుర్రాళ్లతో అద్భుతాలు చేసిన దిల్లీ, పంజాబ్ ప్రదర్శనలను తీసి పారేయలేం. ఆర్సీబీకి ఎప్పటిలానే అదృష్టం కలిసిరాక కీలక మ్యాచ్‌లో తేలిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నంతలో అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కెప్టెన్‌గా విఫలమయ్యాడు ధోనీ, తన సారథ్యంలోని చెన్నై, స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా నిరాశపరిచాయి.
కుర్రాళ్ల జోరు..