కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. క్రికెట్ ప్రపంచ ఛాంపియన్షిప్-2013లో టీమ్ఇండియా విజేతగా నిలిచిన క్షణాలను సోషల్‌మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో అప్పటికే టీ20, వన్డే ప్రపంచకప్‌లు గెలిచి భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అతని సారథ్యంలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన భారత్.. మరో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ చారిత్రక ఘటన నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.
ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ తుదిపోరులో భారత్, ఇంగ్లాండ్ పోటీ పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) రాణించడం వల్ల భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.