అంతర్జాతీయ క్రికెట్లో ఏడాది కాలంగా నో బాల్స్ అంశంలో వివాదాలు చెలరేగుతున్నాయి. బ్రిస్బేన్ వేదికగా జరిగిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా టెస్టులోనూ ఈ వివాదం తార స్థాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 21 ఫ్రంట్‌ఫుట్ నోబాల్స్‌ను అంపైర్లు గుర్తించలేకపోయారు. దీనిపై ఆటగాళ్లు, బోర్డుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ కారణంగా ఫీల్డ్ అంపైర్ల నుంచి ఆ బాధ్యతలను మూడో అంపైర్‌కు అప్పగించేందుకు ఐసీసీ నిర్ణయించిందని సమాచారం. భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్ నుంచే ట్రయల్స్ మొదలవుతాయని తెలుస్తోంది.
ఇప్పట్నుంచి కొన్ని నెలలు నోబాల్స్ అంశాన్ని మూడో అంపైర్‌కు అప్పగించి ఐసీసీ ట్రయల్స్ నిర్వహించనుంది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే భారత్, వెస్టిండీస్ టీ20 సిరీసే మొదటిది’ అని ఐసీసీ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సెకను కాలంలోనే బౌలర్ క్రీజు బయట కాలుపెట్టడం, వెంటనే బంతి దిశ, ఎల్బీ వంటివి గమనించడం కష్టమవుతోందని ఫీల్డ్ అంపైర్లు పేర్కొంటున్నారు. అందుకే నోబాల్‌ను గుర్తించే బాధ్యతలు మూడో అంపైర్‌కు అప్పగిస్తే బాగుంటుందనే చర్చ చాలాకాలం అంతర్గతంగా జరుగుతోంది.
ఇప్పటికే మూడో అంపైర్‌కు ఎక్కువ, సంక్లిష్టమైన బాధ్యతలు ఉన్నాయని మాజీ అంపైర్ సైమన్ టాఫెల్ అంటున్నాడు. డీఆర్‌ఎస్‌కు తోడుగా నోబాల్స్ బాధ్యత అప్పగిస్తే కష్టమని అభిప్రాయపడుతున్నాడు. ట్రయల్స్ విజయవంతమైతే 1992లో కేవలం రనౌట్లు తనిఖీ చేసేందుకు నియమించిన మూడో అంపైర్ నోబాల్స్ సైతం గుర్తించాల్సి ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 సీజన్‌లో అంపైర్ రవి ముంబయి ఇండియన్స్ పేసర్ మలింగ వేసిన బంతిని నోబాల్‌గా గుర్తించకపోవడంతో కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాతా నోబాల్స్ విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి.