ఐపీఎల్... ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతారు. సిక్సర్ల మోతలు, బౌండరీల బాదుడు, చీర్‌గర్ల్స్ చిందులతో స్టేడియం హోరెత్తుతుంది. 2008లో ప్రారంభమైన ఈ పొట్టి క్రికెట్ టైటిల్‌ను చెన్నై, ముంబయి చెరో మూడు సార్లు, హైదరాబాద్ (దక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్), కోల్‌కతా చెరో రెండు సార్లు ముద్దాడగా రాజస్థాన్ రాయల్స్ ఓ సారి గెలిచింది. బెంగళూరు, దిల్లీ, కింగ్స్‌లెవన్ పంజాబ్ ఒక్క సారి కూడా విజేతలు కాలేకపోయాయి.. మరి ఈసారైనా గెలుస్తారో లేదో చూడాలి.
ఛాలెంజర్స్... సవాల్ విసురుతారా
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్, స్టార్క్ లాంటి అద్భుత ఆటగాళ్లున్న రాయల్ ఛాలెంజర్స్.. ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది. గతేడాది క్రిస్‌గేల్‌ని పంజాబ్ సొంతం చేసుకుంది. 2009, 2011, 2016 టోర్నీల్లో మూడు సార్లు ఫైనల్‌కి వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దిగ్గజాలకు కొదవలేకున్నా ఈ జట్టును దురదృష్టం వెంటాడుతోంది . ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ బౌలింగ్‌లో వెనుకంజలో వేస్తోంది. కెప్టెన్ కోహ్లీ సారథ్యంలో సమర్థంగా ఆడుతున్నా కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేస్తోందీ జట్టు. విరాట్, డివిలియర్స్, హెట్మైర్, మొయిన్ అలీ, స్టాయినీస్, గ్రాండ్ హోమ్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కింగ్స్ ఎలెవన్ .. కింగ్ అవుతుందా
ఐపీఎల్ ప్రారంభం నుంచి టైటిల్ గెలవాలనే కసితో ఉంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. 2008లో సెమీఫైనల్ వరకు చేరగా, 2014లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ రెండు సార్లు మినహా మిగతా అన్ని సార్లు ప్లే ఆఫ్స్కీ చేరలేకపోయింది. గతేడాది క్రిస్ గేల్ ఈ టీమ్‌లో చేరినా అదృష్టం వరించలేదు. దాదాపు ప్రతి సీజన్‌కీ కెప్టెన్లను, కోచ్‌లను మారుస్తున్నా.. టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలింది. ఇప్పటివరకు 11 మంది కెప్టెన్లు మారారు. రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, డేవిడ్ మిల్లర్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మహ్మద్ షమీ, మన్దీప్ సింగ్ లాంటి దేశవాళీ ఆటగాళ్లతో ఈసారి బరిలోకి దిగుతోంది. పంజాబ్ జట్టు అనగానే గుర్తొచ్చేది ప్రీతి జింతా. ఫ్రాంఛైజీ యజమానైప్పటికీ దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతుంది.
క్యాపిటల్ జట్టు కేక పుట్టిస్తుందా...
ఐపీఎల్ జట్లన్నింటిలోనూ అంతగా కలిసిరాని జట్టు ఏదైనా ఉందంటే అది దిల్లీనే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కి కూడా చేరలేకపోయింది. 2008,2009లలో సెమీస్ వరకు రాగా, 2012లో ప్లే ఆఫ్స్‌కే పరిమితమైంది. ఈసారి టైటిల్‌పై గురిపెట్టిన జట్లలో ముందున్న జట్టు దిల్లీ. ఫ్రాంఛైజీ పేరుతో సహా చాలా మంది క్రీడాకారుల్ని మార్చింది. ప్రసుత్తం శిఖర్ ధావన్, కొలిన్ మున్రో, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, పంత్ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. బౌలింగ్‌లో బౌల్ట్, రబాడా, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రాలతో బలంగా ఉంది. క్రిస్‌మోరిస్, అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్లతో జట్టు సమతూకంగా ఉంది. గతేడాది వరకు డేర్‌డెవిల్స్‌గా ఉన్న పేరును ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్‌గా మార్చి నూతనోత్సాహంతో బరిలో దిగనుంది దిల్లీ. రికీ పాంటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఇవీ చూడండి..ఎన్నికల తేదీల్లోనూ ఐపీఎల్