తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించడమా.. స్థానం కోల్పోవడమా..! - కేఎల్ రాహుల్

టీమిండియాలో కొంతమంది ఆటగాళ్లకు ప్రతిభ ఉన్నా స్థానం కరవయింది. ప్రదర్శనలో నిలకడ లోపించడం, బెంచ్ స్ట్రెంచ్ బలంగా మారడం వల్ల తప్పనిసరిగా రాణించాల్సిన పరిస్థితి. లేదంటే వారి స్థానానికి ముప్పు పొంచి ఉంది. అలాంటి ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

teamindia
మ్యాచ్

By

Published : Jan 3, 2020, 7:37 AM IST

నిరుడు చక్కని విజయాలు సాధించిన టీమిండియా కొత్త ఏడాదిలోనూ దూసుకుపోవాలనుకుంటోంది. ప్రపంచ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అవసరమైన ప్రతిభ, సదుపాయాలు భారత్‌కు ఉన్నాయి. బెంచ్‌ బలమూ బాగానే ఉంది. కానీ ఒకప్పటి వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాల్లాగా ఈ దశాబ్దంలో క్రికెట్‌ను శాసించాలంటే మ్యాచ్‌ విన్నర్లు కావాలి. ఈ నేపథ్యంలో కొందరు భారత ఆటగాళ్లకిది తాడో పేడో తేల్చుకోవాల్సిన సంవత్సరమే. జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో సత్తా చాటుకోవడం వాళ్లకు చాలా అవసరం. వాళ్లెవరో చూద్దాం!

రాహుల్‌.. నిలకడ రావాలి

ప్రతిభకు కొదవలేదు.. సొగసరి షాట్లు ఆడడంలో తిరుగు లేదు.. అయినా జట్టులో కేఎల్‌ రాహుల్‌ స్థానంపై సందిగ్ధత. టెస్టుల్లో రోహిత్‌ ఓపెనర్‌ అవతారం ఎత్తడం.. మయాంక్‌ మెరుస్తుండడం వల్ల జట్టులో రాహుల్‌ చోటు కోల్పోయాడు. పరిమిత ఓవర్ల జట్లకు పరిమితమయ్యాడు. అక్కడ రోహిత్‌, ధావన్‌ ఓపెనింగ్‌ చేస్తున్నందున ఓ దశలో అతని భవిష్యత్‌పై అనుమానాలు రేకెత్తాయి. ఆ దశలో ధావన్‌ గాయం కారణంగా తనకు అందివచ్చిన అవకాశాన్ని రాహుల్‌ సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనర్‌గా మెరిశాడు. అయితే ధావన్‌ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అతడు ఇప్పుడు మూడో ప్రాధాన్య ఓపెనర్‌. నాలుగో స్థానం ఖాళీ లేదు. ఈ నేపథ్యంలో ఏ స్థానంలో ఆడినా, ఎప్పుడు అవకాశమొచ్చినా మెరుగైన ప్రదర్శన చేయడమొక్కటే రాహుల్‌ ముందున్న కర్తవ్యం.

రాహుల్

కుల్‌దీప్‌.. మళ్లీ మాయ చేసేనా?

తన మణికట్టు మాయాజాలంతో తక్కువ సమయంలోనే జట్టులో కీలక స్పిన్నర్‌గా ఎదిగాడు కుల్‌దీప్‌ యాదవ్‌. సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించగల నైపుణ్యాలతో 2017, 2018లో జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ గతేడాది వన్డే ప్రపంచకప్‌లో తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమై వెనకబడ్డాడు. మరోవైపు సీనియర్‌ ఆటగాడు జడేజా బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించడం వల్ల కుల్‌దీప్‌ స్థానం ప్రమాదంలో పడింది. నిరుడు విండీస్‌తో వన్డేలో హ్యాట్రిక్‌ తీసి ఫామ్‌ అందుకున్నట్లే కనిపించిన అతను జట్టులో చోటు నిలుపుకోవాలంటే చాలా శ్రమించాల్సిందే. చాహల్‌ నుంచి అతనికి గట్టి పోటీ ఉంది.

కుల్​దీప్

పంత్‌కు పరీక్షే

ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టులో అడుగుపెట్టిన వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌.. తక్కువ కాలంలోనే ధోని వారసుడిగా గుర్తింపు పొందాడు. కానీ పరిస్థితులకు తగినట్లు ఆడకపోవడం, నిర్లక్ష్యమైన షాట్లతో నిలకడగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వికెట్ల వెనకాల కూడా తప్పులు చేస్తున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో తన స్థానాన్ని సాహాకు సమర్పించుకున్న అతడు.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ పరీక్ష కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ధోని కెరీర్‌పై స్పష్టత లేకపోవడం వల్ల పంత్‌నే తొలి ప్రాధాన్య వికెట్‌కీపర్‌గా జట్టులో కొనసాగిస్తున్నా కూడా అతను అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు. గతేడాది చివర్లో విండీస్‌తో మ్యాచ్‌ల్లో కాస్త మెరిసిన అతడు.. జట్టులో సుస్థిర స్థానం సాధించాలంటే అదే ప్రదర్శన కొనసాగించాల్సిన అవసరం ఉంది.

పంత్

భువి వచ్చేనా?

టీమిండియా బరిలో దిగుతుందంటే భువనేశ్వర్‌ ఉండాల్సిందే.. ఇది ఒకప్పటి మాట. అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఎదగడం, షమి అద్భుతంగా రాణిస్తున్నందున ప్రస్తుతం భువి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గాయాలూ అతణ్ని వెనక్కులాగాయి. గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లే ఆడినప్పటికీ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న భువి.. మళ్లీ గాయంతో దూరమయ్యాడు. తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో అతనికే స్పష్టత లేదు. దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైని లాంటి యువ పేసర్లు సత్తాచాటుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే భువి ముందు గాయం నుంచి కోలుకోవాలి.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. మరి ఏం చేస్తాడో!

భువనేశ్వర్

అశ్విన్‌ నిలవాలంటే..

గత దశాబ్ద కాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు (564) తీసిన బౌలర్‌గా రికార్డు నమోదు చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ గురించి ఇక్కడ మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. కపిల్‌ దేవ్‌, అనిల్‌ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో బంతితో జట్టుకు విజయాలు అందించిన ఆటగాడిగా నిలిచిన అశ్విన్‌ కెరీర్‌ ప్రస్తుతం సందిగ్దంలో ఉంది. పరిమితి ఓవర్ల జట్టులో అతడు స్థానం కోల్పోయి చాలా కాలమే అయింది. చివరిసారి 2017లో అతడు వన్డే మ్యాచ్‌ ఆడాడు. పేస్‌ బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండడం వల్ల ఉపఖండం ఆవల టెస్టులు ఆడే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. 33 ఏళ్ల వయసులో జట్టులో చోటు కోసం అతను యువ స్పిన్నర్లలో పోటీ పడాల్సి వస్తుంది. టెస్టుల్లోనైనా మరింత కాలం కొనసాగాలంటే మ్యాచ్‌ విన్నర్‌గా తన సత్తా నిరూపించుకుంటూనే ఉండాలి. 2020లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది అతడి భవిష్యత్తును నిర్ణయించనుంది.

అశ్విన్

ధావన్‌.. ఏదీ ధనాధన్‌

దూకుడైన ఆటతీరుతో రెగ్యులర్‌ ఓపెనర్‌గా మారిన శిఖర్‌ ధావన్‌ ప్రస్తుత పరిస్థితి మరీ ఆశాజనకంగా ఏమీ లేదు. ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇటీవల దూకుడు తగ్గింది. వేగంగా ఆడలేకపోవడం వల్ల విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఆ దశలో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్‌ చక్కని బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన 34 ధావన్‌పై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు.

ధావన్

ఇవీ చూడండి.. భారత్​-లంక మ్యాచ్​పై నిరసన ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details