భారతజట్టు డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటిసారిగా టీమ్ ఇండియా జెర్సీ వేసుకొని పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా గబ్బర్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'టీమ్ ఇండియాతో పదేళ్లు. నా దేశం కోసం ఆడుతున్నాను. ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేం ఉండదు. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది. సదా నేను కృతజ్ఞుడిని' అని భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశాడు.
తొలి వన్డేలోనే డకౌట్..
శిఖర్ ధావన్, 2004 అండర్ 19 ప్రపంచకప్‌లో 505 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు అతనివే. ఆ సమయంలో భారత జట్టు నిండా నాణ్యమైన ఆటగాళ్లు ఉండటం వల్ల గబ్బర్‌కు చోటు దక్కలేదు. ఎట్టకేలకు 2010, అక్టోబర్ 20న భారత వన్డే జట్టులో శిఖర్ ధావన్ అరంగేట్రం చేశాడు. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ వన్డే సిరీస్‌లో ధావన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే డక్ అవుట్ అయ్యాడు. తర్వాత తన దూకుడైన మార్క్ బ్యాటింగ్‌తో జట్టులో ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 136 వన్డేల్లో 45 సగటుతో 5,688 పరుగులు చేశాడు. 2011లో టీ20, 2013లో టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. 34 టెస్టులాడిన ధావన్ 40 సగటుతో 2,315 పరుగులు చేశాడు. 61 టీ20 మ్యాచ్‌లాడి 1,588 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీలు అనగానే ధావన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పటి వరకు ప్రపంచస్థాయి టోర్నీల్లో 18 మ్యాచులాడిన గబ్బర్ 65.47 సగటుతో 1,113 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు, 4 అర్ధశతకాలున్నాయి.
శిఖర్ ధావన్ టీ20 లీగ్ కెరీర్ 2008లో దిల్లీ జట్టుతో ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబయికి మారాడు. అక్కడ మంచి ప్రతిభ కనిబరిచాడు. తర్వాత హైదరాబాద్ జట్టు, ధావన్‌ను సొంతం చేసుకుంది. మళ్లీ కొన్ని కారణాల వల్ల గబ్బర్ హైదరాబాద్‌ను వదిలి దిల్లీకి వెళ్లిపోయాడు. 169 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 35 సగటు, 126 స్ట్రైక్‌రేట్‌తో 5,044 పరుగులు చేశాడు ధావన్. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు వరుస సెంచరీలు బాదేసి రికార్డు సృష్టించాడు.