ముంబయి ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎదురేలేని జట్టు. ఇంకా చెప్పాలంటే ఐదుసార్లు విజేత. ఈ సీజన్‌లోనూ డిఫెండింగ్ ఛాంపియనే ఫేవరెట్ అనడంలో ఎవ్వరికీ సందేహాల్లేవు. అదెంత బలమైన జట్టే అయినా ఓ బలహీనతను మాత్రం వదల్లేకపోతోంది.
లీగ్‌లో ఏ జట్టైనా శుభారంభం చేయాలని భావిస్తే రోహిత్ సేన మాత్రం ఓటమితో మొదలుపెడుతోంది. ఒకటో.. రెండో కాదు. ఏకంగా తొమ్మిదోసారి వరుసగా ఆరంభ పోరులో ఓడిపోయింది. ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ చేతిలో ఓడి తమకు అచ్చొచ్చిన (బహుశా!) దారినే అనుసరించింది!
ఎందుకంటే గతంలో ఎనిమిది సార్లు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబయి ఏకంగా ఐదుసార్లు విజేతగా అవతరించింది. 2013 నుంచి తొలిపోరులో ఆ జట్టు గెలిచిందే లేదు. సెంటిమెంట్‌ను కొనసాగించిన నేపథ్యంలో ఈసారీ ట్రోఫీ రోహిత్‌సేనదే అని అభిమానుల విశ్వాసం!
ఆరంభం.. ఎప్పుడెలా?
- 2013లో ఆర్సీబీ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఛేదించలేకపోయింది. దినేశ్ కార్తీక్ (60; 37 బంతుల్లో) పోరాడినా 20 ఓవర్లకు 154/5 మాత్రమే చేసింది. కానీ చివరకి ఈ సీజన్లో ముంబయి తొలి ట్రోఫీ ముద్దాడింది.
- 2014లో అబుదాబి వేదికగా కోల్‌కతాతో తలపడింది. గంభీర్ సేన నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో 122/7కే పరిమితమైంది. అంబటి రాయుడు (48; 40 బంతుల్లో) టాప్ స్కోరర్. ఎలిమినేటర్లో చెన్నై చేతిలో ఓడింది.
- 2015లో ఈడెన్ వేదికగా కోల్‌కతాతో తలపడింది. రోహిత్ (98; 65 బంతుల్లో) మెరవడం వల్ల 168/3తో నిలిచింది. గంభీర్ సేన ఈ లక్ష్యాన్ని 18.3 ఓవర్లకే ఛేదించింది. గౌతీ (57), మనీశ్ (40), సూర్యకుమార్ (46) రాణించారు. ఫైనల్లో చెన్నైని ఓడించిన ముంబయి రెండో ట్రోఫీ అందుకుంది.
- 2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడింది. వాంఖడేలో ముంబయి నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని పుణె 14.4 ఓవర్లకే ఛేదించింది. ఈ ఏడాది ముంబయి ప్లేఆఫ్స్ చేరుకోలేదు.
- 2017లో మళ్లీ రైజింగ్ పుణె చేతిలోనే 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముంబయి నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె ఒక బంతి మిగిలుండగా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్లో ఇదే పుణెపై పరుగు తేడాతో గెలిచి మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.
- 2018లో చెన్నై చేతిలో వికెట్ తేడాతో ఓడింది. ముంబయి నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. ఒక బంతి మిగిలుండగా ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. ఈసారి ముంబయి ప్లేఆఫ్స్ చేరుకోలేదు.
- 2019లో తొలి మ్యాచ్‌లో దిల్లీతో తలపడింది ముంబయి. 37 పరుగుల తేడాతో ఓడింది. రిషభ్ పంత్ (78; 27 బంతుల్లో) చెలరేగడం వల్ల దిల్లీ 213/6 చేసింది. ఛేదనలో యువీ (53; 35 బంతుల్లో) చెలరేగినా 176 పరుగులకే ఆలౌటైంది. ఫైనల్లో చెన్నైపై పరుగు తేడాతో గెలిచి నాలుగో టైటిల్ గెలిచింది.
- 2020లో బలహీనంగా ఉన్న చెన్నై చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది ముంబయి. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబయి 162/9తో నిలిచింది. అంబటి రాయుడు (71), డుప్లెసిస్ (58) ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఫైనల్లో దిల్లీని 5 వికెట్ల తేడాతో ఓడించిన ముంబయి ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదో ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
- తాజా (2021) సీజన్ తొలి మ్యాచ్‌లోనూ ముంబయిది అదే దారి. రోహిత్‌సేన నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి ఛేదించింది. డివిలియర్స్ (48), మ్యాక్స్‌వెల్ (39) రాణించారు.