ఐపీఎల్-13లో గాయం.. ఆ తర్వాత దాన్నుంచి కోలుకోవడానికి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చేరడం వల్ల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. కంగారూ గడ్డపై అడుగుపెట్టాక 14 రోజుల క్వారంటైన్.. సాధనకు ఎక్కువ సమయం లేకపోవడం లాంటి కారణాల నేపథ్యంలో మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్పటిలోపు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడా? తిరిగి లయ అందుకుంటాడా? తుది జట్టులో అతడ్ని తీసుకుంటారా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పుజారా స్థానంలో రోహిత్‌ను టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించడం వల్ల అతడు బరిలో దిగడం ఖాయమైంది.
ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ.. ప్రాక్టీస్ చేసుకునేందుకు ఎలాంటి అవాంతరం లేదు. కాబట్టి అతడు మూడో టెస్టు కచ్చితంగా ఆడనున్నాడు. మరి హిట్‌మ్యాన్‌ను ఏ స్థానంలో ఆడిస్తారు? అతడ్ని జట్టులోకి తీసుకునేందుకు ఎవరిపై వేటు వేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు చర్చంతా వీటి చుట్టూనే తిరుగుతోంది.
వారిద్దరిలో ఒకరిపై వేటు!
రోహిత్ జట్టులోకి రావాలంటే మయాంక్ అగర్వాల్ లేదా హనుమ విహారిలో ఎవరో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సిందే. ఒకవేళ హిట్‌మ్యాన్‌ను ఓపెనర్‌గానే కొనసాగించాలంటే మయాంక్‌పై వేటు తప్పదు. గతంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా టెస్టుల్లో గొప్పగా రాణించకపోవడం వల్ల.. 2019లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సుదీర్ఘ ఫార్మాట్లోనూ అతడ్ని ఓపెనర్‌గా పంపారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్ అద్భుతంగా రాణించాడు. అయితే అది స్వదేశంలో కావడం.. విదేశాల్లో టెస్టుల్లో అతనికి ఓపెనర్‌గా ఇంకా సవాలు ఎదురు కాకపోవడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం.