తెలంగాణ

telangana

ETV Bharat / sports

'యాషెస్​'లో ఆ ఐదుగురిపైనే అందరి దృష్టి

గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ తొలి టెస్టు మ్యాచ్​ ఇంగ్లాండ్​లోని ఎడ్​బాస్టన్​లో జరగనుంది. ఈ పోరులో అందరి కళ్లు ఆ ఐదుగురు క్రికెటర్లపైనే ఉన్నాయి. ఎవరా ఆటగాళ్లు, వాళ్ల కథేంటీ?

'యాషెస్​'లో ఆ ఐదుగురిపైనే అందరి దృష్టి

By

Published : Jul 31, 2019, 5:31 AM IST

ప్రపంచకప్​ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్​.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే యాషెస్​ తొలి టెస్టులో ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలపడనుంది. ఇరు జట్లలోని ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. వారిలో మ్యాచ్​ గతిని మార్చే వాళ్లలో ఈ ఐదుగురు ముందు వరుసలో ఉంటారు. అసలు వారెవరు, వారి ప్రత్యేకతలేంటి. వాటిని వివరిస్తూ రాసిన విశ్లేషణాత్మక కథనం.

ఓపెనింగ్​ సమస్యనురాయ్ తీరుస్తాడా..!

ప్రపంచకప్​లో అదరగొట్టిన ఇంగ్లాండ్​ ఓపెనర్ జేసన్ రాయ్.. ఇప్పటివరకు ఆడింది ఒక టెస్టు మాత్రమే. ఇటీవలే ఐర్లాండ్​తో జరిగిన టెస్ట్​ మ్యాచే అతడికి మొదటిది​. ఆ మ్యాచ్​లోని మొదటి ఇన్నింగ్స్​లో విఫలమైనా... రెండో ఇన్నింగ్స్​లో 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అదే ఉత్సాహంతో యాషెస్​లోకి అడుగుపెట్టనున్నాడు. కొన్నేళ్ల నుంచి ఈ ఫార్మాట్​లో ఓపెనింగ్​ సమస్యతో బాధపడుతున్న ఇంగ్లీష్ జట్టుకు రాయ్ ప్రదర్శన చాలా కీలకం.

జేసన్ రాయ్

టెస్టుల్లో ఓపెనర్​గా విశేష ప్రతిభ కనబర్చిన మాజీ కెప్టెన్​ ఆండ్రూ స్ట్రాస్​, 2012లో రిటైర్మెంట్​ ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థానాన్ని భర్తీ చేసే సరైన బ్యాట్స్​మెన్ ఇంగ్లాండ్​కు దొరకలేదు. ఇప్పుడు రాయ్​ ఆ లోటు తీరుస్తాడని భావిస్తోంది ఇంగ్లాండ్​.

అందరి చూపు ఆర్చర్​పైనే...​

ప్రఖ్యాత యాషెస్​తో తన టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు యువ సంచలనం జోఫ్రా ఆర్చర్​. ప్రపంచకప్​ ఫైనల్​లోని సూపర్​ ఓవర్​తో ఇంగ్లాండ్​ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇప్పడు సంప్రదాయ క్రికెట్​లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

జోఫ్రా ఆర్చర్

24 ఏళ్ల ఆర్చర్​.. ఇప్పటి వరకు 28 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​ల్లో 131 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అదరగొట్టిన ఆర్చర్​​.. టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వైవిధ్యమైన బంతులు సంధించే ఆర్చర్​.. యాషెస్​ను ఎలా ఆరంభిస్తాడో చూడాలి.

కింగ్ ఆఫ్ స్వింగ్.. అండర్సన్

జేమ్స్ అండర్సన్.. 148 టెస్టులాడి ఇంగ్లాండ్​ తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవలే 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. స్టువర్ట్​ బ్రాడ్​తో కలిసి పేస్​ దళం బాధ్యతలు పంచుకోనున్నాడు. బంతిని స్వింగ్​ చేస్తూ ప్రత్యర్థి పని పట్టడంలో ఆండర్సన్​ దిట్ట. సొంతగడ్డపై యాషెస్​ ఆడుతుండటం ఇతడికి అదనపు బలం.

జేమ్స్ అండర్సన్

ఇది అండర్సన్కు నాలుగో యాషెస్ సిరీస్​. ఇతడ్ని అడ్డుకుంటే ఆస్ట్రేలియా తొలి టెస్టు గెలిచేందుకు మార్గం సుగమం కానుంది.

మరోసారి మెరిసేందుకు వార్నర్ సిద్ధం

గతేడాది బాల్​ టాంపరింగ్​ ఉదంతంతో సంవత్సరం పాటు నిషేధానికి గురైన వార్నర్​.. ప్రపంచకప్​లో అద్భుతంగా రాణించాడు. 647 రన్స్​తో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్​ను యాషెస్​లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు.

డేవిడ్ వార్నర్

ఇప్పటి వరకు 74 టెస్టులాడిన వార్నర్.. 48 సగటుతో 6000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలున్నాయి.

గత యాషెస్​లో 3-2 తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ సిరీస్​లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన వార్నర్​.. జట్టును గెలిపించలేకపోయాడు. ప్రస్తుతం పూర్తి ఫామ్​లో ఉన్న ఈ బ్యాట్స్​మెన్ ప్రత్యర్థి బౌలర్లను ఆడుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.

యార్కర్ల కింగ్​ స్టార్క్.. యాషెస్​కు సిద్ధం

గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్​లో ఆస్ట్రేలియా తరఫున కీలక బౌలర్​ మిచెల్ స్టార్క్. ఆసీస్​ పేస్​ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. ఇతడికి తోడుగా జేమ్స్ పాటిన్సన్, పీటర్ సిడెల్, పాట్ కమిన్స్, జోస్ హేజల్​వుడ్​ తమ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

మిచెల్ స్టార్క్

ఇప్పటికి 51 టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్.. 28.20 సగటుతో 200కు పైగా వికెట్లు తీశాడు.

ఇటీవలే జరిగిన మహిళల యాషెస్​లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆ జట్టులోని వికెట్​ కీపర్​గా బాధ్యతలు నిర్వర్తించిన అల్యసా హేలీ.. స్టార్క్ సతీమణి కావడం విశేషం. యాషేస్​ను గెలిచితన భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు.

ఇది చదవండి: యాషెస్: బూడిద కోసం కొట్లాట

ABOUT THE AUTHOR

...view details