తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్: బూడిద కోసం కొట్లాట - England vs Australia 2019

ప్రపంచ క్రికెట్​లో ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక టోర్నీ యాషెస్​. భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​ అంటే ఎంత ఉత్కంఠ ఉంటుందో... ఈ బూడిద సమరం​ కూడా అంతే హోరాహోరీగా జరుగుతుంది. ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్​లో నువ్వా-నేనా అన్నట్లు తలపడతాయి ఇరుజట్లు. ఆగస్టు 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టోర్నీ​ విశేషాలు చూద్దామా..?

యాషెస్

By

Published : Jul 30, 2019, 5:25 PM IST

ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక టోర్నీ యాషెస్​లో పోటీ పడేందుకు ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రపంచకప్​ సెమీస్​లో ఇంగ్లాండ్​ చేతిలో ఓటమిపాలైన ఆసీస్​.. ఈ టోర్నీలో సత్తా చాటాలని భావిస్తోంది. 2017లో జరిగిన యాషెస్​లో ఇంగ్లాండ్​ను ఓడించింది ఆసీస్​. ఈ సారి స్వదేశంలో ఈ టోర్నీ నెగ్గాలని పట్టుదలతో ఉంది ఇంగ్లీష్​ జట్టు. ఆగస్టు 1న ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది.

ఆ కప్పులో బూడిదెందుకు?

యాషెస్​ సిరీస్​లో విజేతకు ఇచ్చే ట్రోఫీ 15 సెం.మీ ఎత్తుతో మట్టితో చేయబడి ఉంటుంది. దీనిలో క్రికెట్​ బెయిల్​ కాల్చగా వచ్చిన బూడిదను నింపి ఉంచుతారు.

యాషెస్ కప్

క్రికెట్​ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ 1882లో స్వదేశంలో మొదటిసారి యాషెస్​ను నిర్వహించింది. ఈ సిరీస్​ను తొలిసారే సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఇంగ్లీష్​ జట్టుకు షాకిచ్చింది. ఆ సందర్భంగా ఓ ఇంగ్లాండ్ వార్త పత్రిక " ఇంగ్లాండ్​ క్రికెట్​ చచ్చిపోయింది. మృతదేహాన్ని తగలబెట్టగా వచ్చిన బూడిదను ఆస్ట్రేలియా పట్టుకెళ్లిపోయింది" అని రాసింది. ఈ విధంగా ఇరుదేశాల మధ్య పరువు ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ టోర్నీ బూడిద సమరంగా మారిపోయింది. 1883లో జరిగిన సిరీస్​లో గెలిచి మళ్లీ స్వదేశానికి కప్పు తెచ్చేసుకుంది ఇంగ్లాండ్​. అప్పట్నుంచి ఈ రెండు దేశాల మధ్య ట్రోఫీ వైరం సాగుతోంది.

తొలి యాషెస్ సందర్భంగా

టెస్టు ఛాంపియన్​షిప్​కు నాంది

యాషెస్‌ అమితాసక్తి ఉన్న సిరీస్‌ కావడం వల్ల ఐసీసీ కొత్త నిర్ణయాలను ఇక్కడ నుంచే అమలు చేయనుంది. టెస్టు క్రికెట్​కు ఆదరణ తగ్గుతుందని భావించిన అంతర్జాతీయ క్రికెట్​ బోర్డు... సరికొత్తగా టెస్ట్​ ఛాంపియన్​షిప్​ను తీసుకొస్తోంది. ఇందులో రెండేళ్ల పాటు జరిగే టెస్ట్​ మ్యాచ్​ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ ఛాంపియన్​షిప్ తొలి మ్యాచ్​ యాషెస్​తోనే ప్రారంభం కావడం విశేషం.

పాతచిత్రం

18 ఏళ్లు... వరుసగా 8

ఇంగ్లాండ్​ గడ్డపై ఆసీస్​ యాషెస్‌ సిరీస్ నెగ్గి 18 ఏళ్లవుతోంది. 2001లో చివరగా అక్కడ విజయం సాధించింది కంగారూ జట్టు. ఆ తర్వాత 9 యాషెస్‌లు జరగ్గా... ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఐదు సిరీస్‌లలో ఆ దేశమే నాలుగు నెగ్గింది. నాలుగు సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లీష్​ జట్టు అన్నింటా విజయం సాధించింది. 2011లో ఆసీస్​ గడ్డపైనే కప్పు సొంతం చేసుకుంది ఇంగ్లాండ్​.

మొత్తంగా ఇప్పటిదాకా 70 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే.. 33 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్‌ 32 సార్లు ట్రోఫీ గెలిచింది. అయిదు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. 1989-2003 మధ్య జరిగిన ఎనిమిది యాషెస్‌ సిరీస్‌ల్లోనూ ఆస్ట్రేలియానే విజేత. యాషెస్‌లో ఇదే అతి పెద్ద వరుస విజయాల రికార్డు.

ఇంగ్లాండ్

మెరుగైన కంగారూలు

ఆరు నెలల ముందు యాషెస్‌ పెడితే.. కంగారూ జట్టుకు భారీ పరాభవం ఎదురయ్యేదేమో. రెండేళ్లలో యాషెస్‌ మినహాయిస్తే ఆస్ట్రేలియా సిరీస్‌ గెలిచింది శ్రీలంకపై మాత్రమే. దక్షిణాఫ్రికా, భారత్‌, పాకిస్థాన్‌ చేతిలో ఓడింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత ఏడాది పాటు తీవ్రంగా తడబడ్డ ఆసీస్‌.. కొన్ని నెలల నుంచి పుంజుకుంది. ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. నిషేధం తర్వాత పునరాగమనం చేసిన వార్నర్, స్మిత్​ల రాకతో మరింత బలం పెరిగింది.

ఆస్ట్రేలియా

ఇద్దరూ కసిగానే

2017లో చివరగా సొంతగడ్డపై జరిగిన యాషెస్‌ను ఆస్ట్రేలియానే సులువుగా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్​ స్టార్ ఆల్​రౌండర్​​ బెన్‌ స్టోక్స్‌ ఓ వివాదంలో చిక్కుకుని టోర్నీకి దూరమవడం అప్పట్లో ఇంగ్లాండ్‌ జట్టుపై మానసికంగా చాలా ప్రభావమే చూపించింది. సొంతగడ్డ అనుకూలత కలిసొచ్చి ఆస్ట్రేలియా సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇటీవలే వన్డేల్లో ప్రపంచకప్‌ కల నెరవేర్చుకోవడం ద్వారా జోష్​ మీదున్న ఇంగ్లీష్‌ జట్టు ఆనాటి పరాభవానికి సమాధానం చెప్పాలనుకుంటోంది. ప్రపంచకప్​ సెమీస్​లో ఇంగ్లాండ్​ చేతిలోనే ఓడిపోయిన ఆస్ట్రేలియా... ఈ సిరీస్​లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

రికార్డులు

ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్​ వేదికగా ప్రారంభం కాబోతున్న ఈ యాషెస్​ సిరీస్​లో ఇప్పటివరకు చెరగని రికార్డులివి.

  1. 1928 నుంచి 1948 వరకు జరిగిన యాషెస్​ టోర్నీల్లో ఇంగ్లాండ్​ లెజెండ్​ క్రికెటర్ డొనాల్డ్​ బ్రాడ్​మన్​ 5 వేల 28 పరుగులు చేశాడు. బ్రాడ్​మన్​ ఈ టోర్నీల్లో 19 సెంచరీలు చేయడం విశేషం. అతడి తర్వాత జాక్​ హబ్స్​ 3వేల 636 పరుగులతో ఉన్నాడు.
  2. 1980లో జరిగిన ఒక్క ఎడిషన్​లోనే 974 పరుగులు చేశాడు బ్రాడ్​మన్​.
  3. 1938లో జరిగిన యాషెస్​లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్​ ఆటగాడు లియోనార్డ్​ హట్టన్​ చేసిన 364 పరుగులే ఇప్పటివరకు వ్యక్తిగత అత్యధికం.
  4. యాషెస్​ కెరీర్(1993-2007)​లో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్​ వార్న్​ 195 వికెట్లు తీశాడు. తర్వాత గ్లెన్​ మెక్​గ్రాత్​157 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న బౌలర్లలో ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ 104 వికెట్లతో కొనసాగుతున్నాడు..
  5. ఆసీస్​ వికెట్​ కీపర్​ ఇయాన్​ హెలే 135 స్టంప్​లు చేశాడు.
  6. ఇయన్ బోతమ్​ ఫీల్డింగ్​లో 54 క్యాచ్​లు సాధించాడు.
  7. 1989లో జరిగిన యాషెస్​ టెస్ట్​లో 61 ఎక్స్​ట్రాలు ఇచ్చింది ఆసీస్​ జట్టు.
  8. పాన్స్​ఫోర్డ్​, బ్రాడ్​మన్​ కలిసి రెండో వికెట్​కు 451 భాగస్వామ్యం నెలకొల్పారు. యాషెస్​లో ఇదే అత్యధిక భాగస్వామ్య రికార్డు.
  9. అలెన్​ బోర్డర్​ ఆసీస్​ జట్టు తరఫున 28 యాషెస్​ టెస్ట్​లకు సారథ్యం వహించాడు. ఎక్కువ విజయాలు (13) సాధించిన కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు.

ABOUT THE AUTHOR

...view details