భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ టెస్టుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక్క పాయింట్ తేడాతో తొలి స్థానం దక్కించుకున్నాడు. 904 పాయింట్లతో స్మిత్ మొదటి స్థానంలో ఉండగా.. 903 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కింగ్ కోహ్లీ.
స్మిత్ రికార్డు బ్రేక్...
2015 డిసెంబర్ నుంచి తొలి స్థానంలో ఉన్నాడు స్మిత్. అయితే 2018 ఆగస్టులో ఈ ఆటగాడు బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో కోహ్లీ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌తో తొలి స్థానం కైవసం చేసుకున్నాడు.
ఏడాది నిషేధం తర్వాత క్రికెట్లోకి అడుగుపెట్టిన స్మిత్.. తొలి టెస్టులో రెండు శతకాలు సాధించాడు. రెండో టెస్టులో 92 పరుగులు చేశాడు. 63.2 శాతం సగటుతో సుదీర్ఘ క్రికెట్లో రాణిస్తున్నాడీ ఆసీస్ దిగ్గజ ఆటగాడు.
తొలి స్థానంలో నిలిచిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడింగ్లే వేదికగా జరగాల్సిన మూడో టెస్టులో బరిలోకి దిగలేదు. నాలుగో టెస్టు బుధవారం ఓల్డ్ ట్రాఫోర్డు వేదికగా జరగనుంది.
త్వరలో మరో అవకాశం..
విండీస్‌తో జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు కోహ్లీ. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. 79 టెస్టులాడిన ఈ స్టార్ ఆటగాడు ఇప్పటికే 25 శతకాలు సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 టెస్టుల సిరీస్ కోహ్లీకి తొలి స్థానం దక్కించుకునేందుకు మరో అవకాశం. అక్టోబర్ 2 నుంచి విశాఖ వేదికగా తొలి టెస్టు జరగనుంది. మొత్తం మూడు టెస్టులు జరగనున్నాయి.
మరో ఇద్దరు పైపైకి...
టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 7వ స్థానంలో నిలిచాడు. ఆంటిగ్వాలోని తొలి టెస్టులో ఒక అర్ధశతకం, ఒక శతకం నమోదు చేశాడు. జమైకా టెస్టులో మరో అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు రహానే.
విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు(289)తో టాప్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు హనుమ విహారి. ఆరు టెస్టులు మాత్రమే ఆడిన ఈ తెలుగు క్రికెటర్... 40 స్థానాలు ఎగబాకి టాప్-30లో నిలిచాడు.
ఇదీ చదవండి...'ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా'