పింక్ బాల్ టెస్టుల్లో ఇంతవరకూ ఓటమే ఎరుగని ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఆసీస్‌కు అచ్చొచ్చిన ఆడిలైడ్ వేదికలో డే/నైట్ టెస్టు, గురువారం ఆడనుంది. సొంతగడ్డ, నైపుణ్యమున్న పేసర్లు, పటిష్ఠ బ్యాటింగ్ లైనప్‌తో కంగారులు... కోహ్లీ సేనకు సవాల్ విసురుతున్నారు. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు టీమ్ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో గెలిచి, పట్టు బిగించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
బ్యాటింగ్‌లో భారత్ పటిష్ఠంగా కనిపిస్తున్నా సరే భిన్నంగా స్పందించే గులాబి బంతిని ఎదుర్కోవడం పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ పంపనున్నారు. మరి ఎలా ఆడతారో చూడాలి. విరాట్ కోహ్లీ, పుజారా, రహానే, విహారీలతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తుండగా.. పుజారాపై మేనేజ్మెంట్ భారీగా ఆశలు పెట్టుకుంది. సాహా వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
భారత పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. గులాబీ బంతితో బుమ్రా, షమి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వీరికి ఉమేశ్ యాదవ్ తోడయ్యాడు.
గులాబీ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సహా అత్యధిక పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టులో లేకపోవడం కోహ్లీ సేనకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్‌గా అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కింది.