భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ప్రతిష్టాత్మక లారెస్ క్రీడా పురస్కారం రేసులో నిలిచాడు. 2000-2020 మధ్య కాలంలో 'దేశం భుజాలపై మోసిన సందర్భం' పేరుతో లారెస్ సంస్థ ఓ ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తోంది. ఈ అవార్డుకు నామినేట్ అయిన 20 మందిలో సచిన్ ఒకడు. 2011 క్రికెట్ ప్రపంచకప్‌లో గెలిచినపుడు భారత జట్టంతా కలిసి సచిన్‌ను తమ భుజాలపై మోస్తూ స్టేడియంలో ఊరేగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని సూచిస్తూ.. సచిన్‌ను పురస్కారానికి నామినేట్ చేశారు.
ఏమిటీ అవార్డు?
లారెస్ సంస్థ ఏటా వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో ఈ పురస్కారాలకు ప్రత్యేక గుర్తింపుంది. క్రీడాకారులు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఇవ్వబోయే పురస్కారాలు మరింత ప్రత్యేకం. లారెస్ క్రీడా అవార్డులు నెలకొల్పి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2000-20 మధ్య కాలంలో అత్యంత ప్రభావం చూపిన క్రీడాకారులకు అవార్డులు ఇవ్వనున్నారు.
సచినే ఎందుకు..
అయిదు పర్యాయాలు ప్రపంచకప్‌లో బరిలోకి దిగి టైటిల్ ఆశలు నెరవేర్చుకోలేకపోయిన మాస్టర్.. 2011లో తన ఆరో ప్రపంచకప్‌లో కల నెరవేర్చుకున్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. సచిన్ సొంత నగరం ముంబయిలో ఫైనల్ ముగిసిన అనంతరం మాస్టర్‌ను కెప్టెన్ ధోని సహా ఆటగాళ్లందరూ భుజాలపై మోశారు. క్రికెట్ చరిత్రలో ఇదో గొప్ప సందర్భంగా నిలిచిపోయింది. అందుకే దీన్ని లారెస్ పురస్కారానికి ఎంపిక చేశారు.
"ఇది మన ఆటలో ప్రత్యేకమైన సందర్భం. లారెస్‌కు నామినేటవడం సులువు కాదు. భారత క్రికెట్లో 2011 ప్రపంచకప్ విజయం గొప్ప ఘనత. 2002లో మా జట్టుకు లారెస్ పురస్కారం దక్కినపుడు గొప్పగా భావించాం"
- లారెస్ అకాడమీ సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా
ఎంపిక ఎలా?
గత 20 ఏళ్లలో గొప్ప ప్రదర్శనలు చేసిన 20 మంది క్రీడాకారులను అవార్డుకు నామినేట్ చేశారు. వీరిలో విజేత ఎవరన్నది ప్రజల ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ నెల 10న మొదలైన ఓటింగ్ ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. 20 మంది నుంచి 10 మందికి.. ఆ తర్వాత అయిదుగురికి జాబితాను కుదిస్తారు. ఫిబ్రవరి 17న బెర్లిన్‌లో జరిగే లారెస్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో.. విజేతను ప్రకటిస్తారు.
ఇదీ చదవండి: క్రికెటర్లకు 'ఊర్వశి' గాలం.. పంత్, హార్దిక్ సేఫ్!