ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పొగడ్తలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ఐపీఎల్ వల్లే టీమ్ఇండియా బెంచ్ బలం పెరిగిందని కీర్తించాడు. ఆటగాళ్ల పురోగతికి ఈ లీగ్ ఎంతోగానో తోడ్పడిందని లిటిల్ మాస్టర్ పేర్కొన్నాడు. ప్రతి ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం ఈ టోర్నీతో ఏర్పడిందని తెలిపాడు.
"మేము క్రికెట్ ఆడే తొలినాళ్లలో మాకు ఈ అవకాశం లేదు. వసీమ్ అక్రమ్, షేన్ వార్న్, మెక్ డెర్మాట్, మెర్వ్ హ్యూగ్స్ వంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడేవాళ్లం. కానీ, ఐపీఎల్ వల్ల ప్రస్తుతం ఈ ఇబ్బంది లేకుండా పోయింది. ఈ పొట్టి లీగ్‌లోనే మేటి క్రికెటర్ల బౌలింగ్‌లో ఆడే అవకాశం ఉంది. తాజాగా సూర్య, ఇషాన్ గొప్పగా ఆడటానికి కారణమిదే."
-సచిన్ తెందుల్కర్, భారత మాజీ క్రికెటర్.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే అదరగొట్టారు. వారు ఇంతకుముందే ఆర్చర్, స్టోక్స్ వంటి బౌలర్లను ఐపీఎల్లో ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు ఇంగ్లిష్ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరి బౌలింగ్ ఆడటానికి సూర్యతో పాటు ఇషాన్ ఎటువంటి సంకోచం చూపలేదు.