కెరీర్ ఆరంభంలో లాక్‌డౌన్ పరిస్థితులు ఉంటే తనకు చాలా కష్టమయ్యేదని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అతడు తాజాగా ఓ ఛానెల్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. లాక్‌డౌన్ వేళ క్రీడాకారులు చాలా రోజులు ఇంట్లోనే కూర్చోవడం మంచిది కాదని చెప్పాడు. ఆటగాళ్లకు ఇలాంటి సమయం రాదని, ఈ లాక్‌డౌన్‌తో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం దక్కిందని చెప్పాడు.
"మనమంతా చాలా లక్కీ. మీకూ, నాకూ 3 లేదా 4 గదులున్నాయి. బయట ఎంతో మంది పెద్ద కుటుంబంతో ఒకే గదిలో ఉంటున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతుంటారు. కానీ, అందరూ మే 3 వరకు ఓపిక పట్టాల్సిందే. ప్రస్తుతం నేనున్న ప్రదేశానికి అలవాటు పడ్డా. ఎందుకంటే క్రికెట్ ఆడే రోజుల్లో చాలా క్యాంపులకు వెళుతుండేవాడిని కాబట్టి ఇప్పుడది అలవాటైంది."