టీమిండియా.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే పేరు. ఎందరో ప్రతిభావంతులు.. యువ రక్తం కలయిక భారత జట్టు. అటు పురుషుల జట్లయినా.. ఇటు మహిళల జట్లయినా.. ఎవరికి వారే సాటి. కానీ ఇప్పుడు భారత క్రికెట్‌కు 'ఐసీసీ' గండం వచ్చినట్టు కనపడుతోంది. ఇందుకు గత కొన్నేళ్లుగా జరిగిన ఐసీసీ ఈవెంట్స్‌లో మన ప్రదర్శనే నిదర్శనం. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ఓ ఉదాహరణ.
భారత సీనియర్లు(పురుషులు, మహిళలు) ఓ ఐసీసీ ఈవెంట్‌ను గెలుచుకుని దాదాపు 7ఏళ్లు(ఛాంపియన్స్ ట్రోఫీ 2013 తర్వాత) గడిచిపోయింది.
పురుషుల పరిస్థితి ఇలా...
ఇంగ్లాండ్ వేదికగా 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌కు ఎన్నో జ్ఞాపకాలిచ్చింది. అప్పటి నుంచి ఐసీసీ కప్‌ను ముద్దాడేందుకు నిరీక్షణ సాగుతూనే ఉంది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో చెలరేగే అబ్బాయిలు.. సెమీస్‌కు చేరే సరికి చేతులెత్తేస్తున్నారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇదే జరిగింది.
సెమీస్ గండం గట్టెక్కితే చాలు అనుకుంటే.. ఫైనల్స్‌లోనూ పురుషుల జట్టు తడబడిన దృశ్యాలు ఎన్నో చూశాం. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో ఈ పరిస్థితులే కనపడ్డాయి.