తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​ X సంజు: టీమిండియాలో సత్తా చాటేదెవరు..?

ఇటీవలే వరుస టెస్టు సిరీస్​లు గెలిచిన భారత్​... డిసెంబర్​ 6 నుంచి వెస్టిండీస్​తో టీ20, వన్టే సిరీస్​లు ఆడనుంది. అయితే పొట్టి ఫార్మాట్​ మ్యాచ్​లకు ముందు ధావన్​ గాయంతో తప్పుకోగా.. ఆ చోటును సంజు శాంసన్​తో భర్తీ చేశారు సెలక్టర్లు. ఇప్పటికే జట్టులో ఉన్న పంత్​ ఓ వైపు పుంజుకోవాలని చూస్తుండగా.. జట్టులో స్థానం నిలబెట్టుకోవాలని సంజు భావిస్తున్నాడు. ఫలితంగా కీపర్​ స్థానం కోసం వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది.

By

Published : Nov 29, 2019, 9:31 AM IST

team india wicket keepers panth and sanju samson rivalry for position
టీమిండియాలో సత్తా చాటేదెవరు..? పంత్​-సంజు మధ్య పోటీ

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్ ఎంపికతో భారత క్రికెట్లో ఇప్పుడు ఆసక్తికర పోటీ ఏర్పడింది. ఎంతో ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక కసితో సంజు ఉంటే.. కెరీర్‌ను ఘనంగా ఆరంభించినా ఇటీవల పేలవ ఫామ్‌తో జట్టులో స్థానం నిలబెట్టుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితిలో రిషభ్ పంత్‌ ఉన్నాడు. ఇద్దరూ అసాధారణ నైపుణ్యమున్న కుర్రాళ్లే. ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాళ్లే. ఈ ఇద్దరి లక్ష్యమూ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ధోని స్థానాన్ని చేజిక్కించుకోవడమే!

  • శాంసన్​ సొగసైన బ్యాటింగ్​...

ఇప్పటిదాకా టీమిండియాకు ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడంటే అది సంజు దురదృష్టమనే చెప్పాలి. పంత్‌లాగే సంజు దూకుడైన ఆటగాడు. కానీ సంయమనానికి, సహనానికి అతడి నిఘంటువులో చోటుంది. చక్కని టెక్నిక్‌, టైమింగ్‌ అతడి సొంతం. అవసరమైతే నిలబడతాడు లేదంటే దంచికొడతాడు. ప్రశాంతంగా ఉంటూ ప్రళయం సృష్టించగలడు. అలవోకగా గేర్లు మార్చగలడు. మైదానం అన్ని వైపులా షాట్లు ఆడతాడు. ఎంత నేర్పుగా గ్రౌండ్‌ షాట్లు ఆడతాడో.. అంతే అలవోకగా గాల్లోకి బంతిని లేపుతాడు.

కళ్లు చెదిరే కవర్‌డ్రైవ్‌లు, స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు, పుల్స్‌, లాఫ్టెడ్‌ షాట్లు.. ఇలా సంజు అమ్ములపొదిలో లేని షాట్లు లేవు. భీకరంగా విరుచుకుపడ్డా.. ప్రతి షాటూ అందంగానే ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందుకే ఏ ఫార్మాట్‌కైనా సరిపోయే బ్యాటింగ్‌ అతడిదని క్రికెట్​ పండితులు అంటుంటారు.

సంజు శాంసన్​

మంచి తరుణం

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు సంజు. తర్వాత వెస్టిండీస్​తో టీ20లకు అతడిని పక్కనపెట్టి సెలక్టర్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకు సంజు ఫామే కారణం. ఇన్నాళ్లు తన కెరీర్‌కు ప్రధాన అడ్డంకిగా మారిన నిలకడ లోపాన్ని అధిగమిస్తూ సూపర్‌ ఫామ్‌ను అందుకున్నాడు.

ఇటీవలే ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో 8 మ్యాచ్‌ల్లో 58.57 సగటుతో 410 పరుగులు చేశాడు. గోవాపై కేవలం 129 బంతుల్లో 212 పరుగులు చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇప్పుడు ధావన్‌ గాయంతో అదృష్టం అతడి తలుపు తట్టింది. విండీస్‌తో సిరీస్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో ఆడే అవకాశం దక్కొచ్చు. భారత్‌ తరఫున ఆడేందుకు ఇంకొన్ని ఛాన్స్​లూ రావచ్చు. సంజు దేశవాళీ జోరును కొనసాగిస్తే టీమిండియాలో నిలదొక్కుకోలేడనడానికి ఎలాంటి కారణాలూ కనపడట్లేదు. పంత్‌ తడబడుతున్న ఈ తరుణంలో అతడికి దక్కింది సువర్ణావకాశమే.

  • స్ట్రోక్​ ప్లేయర్​ పంత్​...

పంత్‌ అంటేనే దూకుడు. అతడిలో ఆకట్టుకునేది ఎంతటి బౌలర్‌నైనా భయంలేకుండా అలవోకగా ఎదుర్కొనే తీరే. చిన్న వయసులో అతడికి టీమిండియాలో స్థానం సంపాదించి పెట్టింది ఆ దూకుడే. వచ్చాడంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. నిలదొక్కుకునే దాక ఆచితూచి ఆడడం, బౌలరెవరో చూడడం, మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఆడడం, వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్త పడటం అతడికి తెలియని విద్యలు.

తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెడతాడు. భారత క్రికెట్లో మంచి స్ట్రోక్‌ ప్లేయర్లలో అతడు ఒకడు. సాహసాలకు వెనుకాడడు. కొత్త కొత్త షాట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. పుల్స్‌, లాఫ్టెడ్‌ షాట్లు ఆడడంలో దిట్ట. లెగ్‌ స్టంప్‌ లోగిలిలో బంతి అందితే చుక్కలు చూడాల్సిందే. మెరుపు వేగంతో వచ్చిన బంతితో ర్యాంప్‌ షాట్‌తో అలవోకగా స్టాండ్స్‌లో పడేసి బౌలర్‌ను నివ్వెరపోయేలా చేస్తాడు. ఒంటి చేత్తోనూ సిక్స్‌ కొట్టిన సందర్భాలెన్నో. ఫార్మాట్‌తో అతడికి సంబంధం లేకుండా విధ్వంసకర ప్రదర్శన అతడి సొంతం.

రిషబ్​ పంత్​

పరీక్షా సమయం...

భయమన్నదే తెలియదన్నట్లు ఆడి ప్రశంసలు అందుకున్న పంత్‌.. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఆడుతున్నందుకు తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. ఆకాశాన్నంటే ఆత్మవిశ్వాసంతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అతడు.. పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయి పరుగుల కోసం సతమతమవుతున్నాడు.

కొన్ని రోజుల కిందటి వరకు అన్ని ఫార్మాట్లలో ధోనీ వారసుడిగా, నంబర్‌వన్‌ వికెట్‌కీపర్‌గా ఉన్న పంత్‌.. ఇప్పటికే సీనియర్‌ సాహా రాకతో టెస్ట్‌ ఎలెవన్‌లో చోటు కోల్పోయాడు. వన్డేలు, టీ20ల్లో స్థానాన్ని నిలుపుకోవడం కోసం పోరాడాల్సిన స్థితికి చేరుకున్నాడు. గత పది టీ20ల్లో మూడు సార్లు మాత్రమే రెండంకెల స్కోరు చేసిన అతడు.. ఆడిన 12 వన్డేల్లో ఇప్పటివరకు ఒక్క అర్ధశతకమూ సాధించలేకపోయాడు. వికెట్‌కీపింగూ తీసికట్టుగా మారింది. పేలవ ఫామ్‌కు తోడు, ఇతర కుర్రాళ్ల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో ఇక నుంచి ప్రతి మ్యాచూ రిషభ్ పంత్​కు కీలకం కానుంది.

ABOUT THE AUTHOR

...view details