తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ రికార్డ్​... మూడింట టాప్​-10లో చోటు

టీమిండియా ఓపెనర్​​ రోహిత్​శర్మ మరో ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​లో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో టాప్-10లో నిలిచిన రెండో క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు.

మూడు ఫార్మాట్లలోనూ టాప్​-10లో రోహిత్​

By

Published : Oct 23, 2019, 6:32 PM IST

టెస్టుల్లో తొలిసారి ఓపెనర్​గా బరిలోకి దిగిన టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మ.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల సిరీస్‌ను.. భారత్​ క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించిన హిట్‌ మ్యాన్‌... మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్​లోనూ టాప్​ లేపాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లో చోటు దక్కించుకున్నాడు.

జోరు​ పెరిగిందోచ్​...

సఫారీలతో చివరి టెస్టు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌.. రాంచీ టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించడం వల్ల, అతడి ర్యాంకింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా​ మారిపోయింది. ప్రస్తుతం 722 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ తర్వాత హిట్​మ్యాన్​..

ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్‌ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 10వ స్థానంలోనూ, వన్డేల్లో రెండు, టీ20ల్లో ఏడో ర్యాంక్​లో ఉన్నాడు హిట్​మ్యాన్​.

టెస్టుల్లో ప్రస్తుతం విరాట్​ రెండో స్థానంలో ఉండగా... అగ్రస్థానంలో స్టీవ్‌ స్మిత్‌(ఆస్టేలియా) కొనసాగుతున్నాడు. కోహ్లీ, స్మిత్​ మధ్య 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

టాప్​-10లో నలుగురు మనోళ్లే...

రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే.. ర్యాంకింగ్స్​లో 5వ స్థానానికి చేరుకున్నాడు. మరో టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్​ పుజారా నాలుగులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌ ఉండటం విశేషం.

కోహ్లీ, రహానే, పుజారా, రోహిత్​

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన జస్ప్రీత్‌ బుమ్రా.... మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. రవిచంద్ర అశ్విన్​ పదో స్థానానికి దిగజారాడు. రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి.. 14, 15 స్థానాలలో కొనసాగుతున్నారు.

సఫారీ జట్టును వైట్‌వాష్‌ చేయడం వల్ల టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతూ.. మరిన్ని పాయింట్లు సంపాదించుకుంది. 119 రేటింగ్‌ పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టాప్‌-10 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌(అక్టోబర్​ 23, 2019 నాటికి)

  • బ్యాటింగ్‌:

స్టీవ్‌ స్మిత్‌(ఆసీస్​), విరాట్‌ కోహ్లీ(భారత్​), కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్​), పుజారా(భారత్​), రహానే(భారత్​), నికోలస్​ హెన్రీ(న్యూజిలాండ్​), జో రూట్​(ఇంగ్లాండ్​), టామ్​ లేథమ్(న్యూజిలాండ్​)​, కరుణరత్నె(శ్రీలంక), రోహిత్​శర్మ(భారత్​).

  • బౌలింగ్‌:

పాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా), కగిసో రబాడ(దక్షిణాఫ్రికా), హోల్డర్‌(వెస్టిండీస్​), జస్ప్రీత్​ బుమ్రా(భారత్​), జేమ్స్‌ అండర్సన్‌(ఇంగ్లాండ్​), ట్రెంట్​ బౌల్ట్ (న్యూజిలాండ్​)​, నీల్​ వాగ్నర్(న్యూజిలాండ్​)​​, ఫిలాండర్(దక్షిణాఫ్రికా)​, కీమర్​ రోచ్(వెస్టిండీస్​)​, రవిచంద్ర అశ్విన్(భారత్​).​

  • ఆల్​రౌండర్లు:

హోల్డర్‌, రవీంద్ర జడేజా, షకీబుల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, ఫిలాండర్‌, రవిచంద్ర అశ్విన్​, పాట్​ కమిన్స్​, మిచెల్​ స్టార్క్​, మొయిన్​ అలీ, క్రిస్​ వోక్స్​

  • జట్లు:

భారత్​, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్​, వెస్టిండీస్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​.

ABOUT THE AUTHOR

...view details