టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మ.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ నుంచే విధ్వంసకర ప్రదర్శన చేస్తోంది. ఈ మెగాటోర్నీలో భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి.. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
మెల్బోర్న్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. టీమిండియా 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లో 46 పరుగులు(4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టు బ్యాటింగ్‌లో రాణించింది. తన మెరుపు సిక్సర్లతో.. అన్నా పీటర్సన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డునూ బ్రేక్ చేసింది. సహా బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నా.. బెరుకు లేకుండా 14వ ఓవర్ల వరకు పోరాడిందీ 16 ఏళ్ల యువతి.
"పవర్‌ప్లేలోనే పరుగులు సాధించటం చాలా సంతోషాన్నిచ్చింది. బౌలర్ ఎప్పుడు తప్పిదం చేస్తారా అని ఎదురు చూశాను. వాళ్లు వేసిన స్లో బంతుల్ని ఎదుర్కోవటంలో విజయం సాధించాను. వీటన్నిటికి కారణం నేను అబ్బాయిలతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేయటమే. శిక్షణలో సహకరించినందరికి నా కృతజ్ఞతలు."
- షెఫాలీ వర్మ, టీమిండియా క్రికెటర్