ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డే ఓటమికి కారణం చెప్పుకొచ్చాడు భారత ఓపెనర్ శిఖర్ ధావన్. తొలి 10-15 ఓవర్లలో తాము చక్కగా ఆడామన్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకోవడం వల్లే ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయినట్లు చెప్పాడు. ఇదే పరాజయానికి కారణమైందని అన్నాడు.
"తొలి 10-15 ఓవర్లు మేం బాగానే ఆడాం. ఎప్పుడైతే స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకున్నామో అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది. మేం ఆటలో వెనకబడ్డాం. దానిని సరిచేసేందుకు ప్రయత్నించినా పొరపాటు జరిగిపోయింది"
- శిఖర్ ధావన్, టీమిండియా క్రికెటర్
కోహ్లీ, రోహిత్, తనపై టీమిండియా అతిగా ఆధారపడుతోందా అన్న ప్రశ్నకు కూడా సమాధానమిచ్చాడు.
"చూడండి ఇదొక దుర్దినం అంతే. వెస్టిండీస్‌పై మేం చాలా బాగా ఆడాం. మా బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించారు. శ్రేయస్ యువకుడు.. బాగా ఆడుతున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్‌లు తప్పవు. ఒక జట్టుగా మేం ఒకర్నొకరం ప్రోత్సహించుకుంటాం. ఏ ఒక్కరిపైనో ఎక్కువ దృష్టిపెట్టం. ఆధారపడం. ఆసీస్ బాగా ఆడింది. మాకు అదృష్టం కలిసిరాలేదు" అని ధావన్ జవాబిచ్చాడు.