తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీవీఎస్​ లక్ష్మణ్​.. 'వెరీ వెరీ స్పెషల్​' బ్యాట్స్​మన్​

వంగిపురపు వెంకటసాయి లక్ష్మణ్‌.. అలియాస్​ వీవీఎస్​ లక్ష్మణ్​... టెస్టు క్రికెట్​లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఆటగాడు. సచిన్​ తెందూల్కర్​, రాహుల్​ ద్రవిడ్​, సౌరభ్​ గంగూలీ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోని స్పెషల్​ క్రికెటర్​ ఇతడు. హైదరాబాద్​లో పుట్టి ప్రపంచ క్రికెట్​లో గొప్ప పేరు తెచ్చుకున్న వీవీఎస్​.. తనదైన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు. నేడు 45వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కొన్ని విశేషాలు..

టెస్టుల్లో 'వెరీ వెరీ స్పషల్​' బ్యాట్స్​మెన్​

By

Published : Nov 1, 2019, 1:02 PM IST

సొగసరి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించిన పోరాట యోధుడు​​. తన ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన అద్భుత క్రికెటర్​. కంగారూ జట్టు పేసర్లను ఎదుర్కోవడంలో దిట్ట అయిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ను.. క్రికెట్‌ ప్రపంచమంతా వెరీ వెరీ స్పెషల్​గా పిలుచుకుంటుంది. అద్వితీయ పోరాటంతో భారత జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించిన ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ 45వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా అతడు ఆడిన కొన్ని స్పెషల్‌ ఇన్నింగ్స్‌..

విజయాల జట్టును ఓడించాడు..

వరుసగా 15 టెస్టుల్లో విజయం సాధించి ఎదురులేని జట్టుగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా.. భారత పర్యటనకు వచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌లో ముంబయిలో జరిగిన తొలి మ్యాచ్​లో టీమిండియాపై గెలిచేసింది కంగారూ జట్టు. కోల్​కతాలోని రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్​ గెలవాలని సిద్ధమైంది.

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో పట్టుదలతో బరిలోకి దిగిందిగంగూలీసేన. స్టీవ్‌ వా (110), హెడెన్‌ (97) రాణించడం వల్ల ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియాను ఆసీస్‌ బౌలర్లు బెంబేలెత్తించారు. లక్ష్మణ్‌ (59) మినహా ఎవరూ రాణించకపోవడం వల్ల భారత్‌ 171 పరుగులకే కుప్పకూలింది. ఐదో స్థానంలో వచ్చిన దిగిన లక్ష్మణ్‌ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. భారత్​ను ఫాలోఆన్‌ ఆడించింది.

రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. ఇంకా రెండు రోజులకు పైగా ఆట ఉండటం వల్ల.. ఆసీస్‌ బౌలర్లను అడ్డుకుని మ్యాచ్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో యాజమాన్యం ద్రవిడ్‌కు బదులుగా వన్‌డౌన్‌లో లక్ష్మణ్‌ను పంపించాలని నిర్ణయించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన లక్ష్మణ్‌.. కనీసం కాళ్లకు ప్యాడ్‌ కూడా విప్పలేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.

దాస్ (39), సచిన్ (10) వెనుదిరిగినా గంగూలీ (48)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దాదా ఔటైన తర్వాత ద్రవిడ్‌ (180)తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్‌ బౌలర్లపై విజృంభించి ద్విశతకాన్ని బాదాడు. స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ట్రిపుల్‌ శతకాన్ని అందుకునే దిశగా పయనించాడు. కానీ మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో ఔటవ్వడం వల్ల 281 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడీ ఆటగాడు. ద్రవిడ్‌, లక్ష్మణ్‌ అసాధారణమైన పోరాట ఫలితంగా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 629/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

అనంతరం భారత బౌలర్లు చెలరేగడం వల్ల ఆసీస్‌ 212 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఈ మ్యాచ్‌ సంచలనంగా మారింది. ఫాలోఆన్‌కు దిగిన గంగూలీ సేన బలమైన ఆసీస్‌పై గెలవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆఖరి టెస్టులోనూ భారత జట్టే గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం.

టెయిలెండర్​తో పోరాటం..

2010లో ఆస్ట్రేలియా మరోసారి భారత పర్యటనకు వచ్చింది. మొహాలి వేదికగా జరిగిన టెస్టులో ఆసీస్‌కు నిరాశే ఎదురైంది. విజయం అందినట్లే అంది కంగారూలకు దూరమైంది. లక్ష్మణ్ మరోసారి అద్భుతంగా పోరాడటం వల్ల ధోనీసేన వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 428 పరుగులు చేయగా, భారత్ 405 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టడం వల్ల ఆసీస్‌ 192 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యం 215 పరుగులే ఉండటం... భారత్‌కు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ ఆసీస్‌ బౌలర్ల ధాటికి భారత వికెట్లు టపటపా నేలకూలాయి. 124 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ధోనీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్‌కు విజయం ఖాయమని భావిస్తోన్న సమయంలో.. ఇషాంత్‌ శర్మ (31)తో కలిసి లక్ష్మణ్ (73*) అద్వితీయంగా పోరాడాడు. తన స్ట్రోక్‌ ప్లేతో ఆసీస్‌ బౌలర్లను నిస్సహాయులను చేశాడు. సహచరులంతా పెవిలియన్‌కు చేరుతున్నా తన అనుభవంతో జట్టుకు విజయాన్ని అందించాడు.

పాక్‌ గడ్డపై భారత్​ జెండా రెపరెపలు..

సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన లక్ష్మణ్‌.. పరిమిత ఓవర్లలో క్రికెట్​లోనూ తన మార్క్‌ చూపించాడు. 2004లో పాక్‌ పర్యటనకు వెళ్లిన గంగూలీసేన విజేతగా తిరిగొచ్చింది. నిర్ణయాత్మక పోరులో శతకం సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు లక్ష్మణ్.

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్-పాక్‌ చెరో రెండు మ్యాచులను గెలిచి 2-2తో సమంగా నిలిచాయి. ఆఖరి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో లాహోర్‌లో బరిలోకి దిగాయి. ఈ నిర్ణయాత్మక పోరులో లక్ష్మణ్‌ ముచ్చటైన షాట్లతో అలరిస్తూ మూడంకెల స్కోరుని అందుకున్నాడు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 293 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు 253 పరుగులకే కుప్పకూలింది. లక్ష్మణ్‌ విలువైన శతకంతో పాక్‌ గడ్డపై భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

మరిన్ని విశేషాలు...

  • 16 ఏళ్ల తన క్రికెట్‌ కెరీర్‌లో.. భారత్‌ తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు లక్ష్మణ్.
  • టెస్టుల్లో 45.5 సగటుతో 8,781 పరుగులు చేశాడు. దీనిలో రెండు ద్వితకాలు, 17 శతకాలు, 56 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు చేశాడు.
  • సుదీర్ఘ ఫార్మాట్‌లో రారాజుగా పేరుపొందిన ఈ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్ భారత్ తరఫున ప్రపంచకప్‌కు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు.

2008 పెర్త్‌ టెస్టు, 2009 నేపియర్ టెస్టుల్లో గొప్పగా పోరాడాడు లక్ష్మణ్​. సగటు భారత అభిమాని గర్వించగలిగేలా ఆటతీరు ప్రదర్శించిన లక్ష్మణ్‌.. 2012 ఆగస్టులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details