న్యూజిలాండ్, భారత్ మధ్య టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా మొదటి టీ20 శుక్రవారం ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కివీస్ వెళ్లిన కోహ్లీ సేన... బుధవారం సరదాగా గడిపింది. గురువారం మాత్రం యథావిధిగా నెట్స్‌లో కఠిన సాధన చేసింది. ఆటగాళ్లంతా అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో కీపింగ్ చేసిన కేఎల్ రాహులే న్యూజిలాండ్‌తో టీ20లకు కీపింగ్ చేసే అవకాశాలున్నాయి.
బీసీసీఐ ట్వీట్...
భారత జట్టు కోచ్‌ల నేతృత్వంలోరాహుల్... గురువారం కీపింగ్ సాధన చేశాడు. యువ పేసర్ నవదీప్ సైనీ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కష్టపడ్డాడు. వారిద్దరూ చురకత్తుల్లాంటి బంతులు సంధించారు. వికెట్లను నేరుగా గురిచూస్తూ పదునైన యార్కర్లు విసిరారు. ఆ బంతులను రాహుల్ అందుకొనే ప్రయత్నం చేశాడు. సాధనలో అతడు ఎంతో ఉల్లాసంగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. "కేఎల్ రాహుల్ నీ కీపింగ్ గ్లోవ్స్ సిద్ధం చేసుకున్నావా?" అనే కామెంట్‌నూ జత చేసింది.
కోహ్లీ ప్రశంసలు...
"రాహుల్ జట్టు మనిషి. టీమిండియా కోసం అతడు ఏ పాత్ర ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాడు. ఆసీస్ సిరీస్‌లో కీపింగ్‌లో రాణించాడు. అందువల్లే అదనపు బ్యాట్స్‌మన్ రూపంలో జట్టుకు మేలు జరుగుతోంది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా" అని కెప్టెన్ కోహ్లీ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పాడు.