అంతర్జాతీయ క్రికెట్లో రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. అతడు మైదానంలో బరిలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. ఈ మధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
హ్యాట్రిక్ బౌల్డ్...
విరాట్ కోహ్లీని ఒక్కసారి బౌల్డ్ చేస్తే ఆ బౌలర్‌ను చాలా గొప్పగా చూస్తారు క్రికెట్ అభిమానులు. బుమ్రా లాంటి బౌలర్ అతడిని నెట్స్‌లో ఔట్ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. అలాంటి కోహ్లీ వరుసగా ఆడిన మూడు వన్డేల్లోనూ బౌల్డ్ అయి ఆశ్చర్యపరిచాడు. ఇలా ఔటవడం విరాట్ వన్డే కెరీర్లో మొదటిసారి.
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో అర్ధశతకం చేసిన కోహ్లీ.. కివీస్ స్పిన్నర్ ఇష్ సోథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తాజాగా రెండో వన్డేలో సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లకు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరిమ్యాచ్‌లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఇదే తరహాలో ఔటయ్యాడు విరాట్.
సౌతీ 'ఆరుసార్లు'...
వన్డే ఫార్మాట్‌లో కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో రవి రాంపాల్‌తో కలిసి సౌథీ సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వీరిద్దరూ ఆరేసి సార్లు విరాట్‌ను పెవిలియన్‌కు పంపారు. ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ తిశారా పెరీరా, ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాలు ఐదేసి సార్లు ఔట్ చేసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో చూస్తే సౌథీ బౌలింగ్‌లోనే... కోహ్లీ ఎక్కువ సార్లు ఔట్ అయ్యాడు. 9 సార్లు ఈ కివీస్ పేసర్ బౌలింగ్‌లో ఖంగుతిన్నాడు. అండర్సన్, గ్రేమ్ స్వాన్‌లు 8 సార్లు, జంపా, రాంపాల్, మోర్కెల్‌లు ఏడేసిసార్లు విరాట్ వికెట్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.