కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్వహించిన చారిత్రక తొలి డే/నైట్ టెస్టుకు... మొదటిరోజు 60వేల మంది ప్రేక్షకులు వచ్చారు. ఇంత మంది జనం ఓ టెస్టు మ్యాచ్ తిలకించేందుకు రావడం ఆశ్చర్యకరమైన విషయం. గులాబీ టెస్టు పుణ్యమా అని ఆ అరుదైన దృశ్యమూ కనిపించింది. అయితే జనాల్ని స్టేడియాలకు రప్పించడానికి ప్రతిసారీ డే/నైట్ టెస్టు నిర్వహించడమంటే కష్టం. అలా చేస్తే టెస్టులు సంప్రదాయ కళను కోల్పోవచ్చు. మరి ఎప్పటిలాగే పగటి పూటే టెస్టులు నిర్వహిస్తూ జనాల్ని స్టేడియాలకు రప్పించడం, ఈ ఫార్మాట్ పట్ల ఆసక్తి పెంచడం సాధ్యమా కాదా అన్నది ప్రశ్నార్థకం.
ఐపీఎల్ మ్యాచ్‌లా...
ఈడెన్‌లో మూడు రోజుల పాటు సాగిన ఆట చూస్తుంటే అసలు ఇది టెస్టు మ్యాచేనా అన్న భావన కలిగింది అందరికీ. ఈ మ్యాచ్‌ను డే/నైట్‌లో, గులాబి బంతితో నిర్వహించడం మాత్రమే ఇందుకు కారణం కాదు. ఆటగాళ్లు తెలుపు దుస్తుల్లో ఆడుతున్నపుడు వెనుక వీక్షకుల గ్యాలరీ నిండుగా కనిపించడమే ఈ ఆశ్చర్యానికి కారణం. గత దశాబ్ద కాలంలో భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్‌కు ఏ స్టేడియంలోను జనం నిండిన దాఖలాలు లేవు. అంతకంతకూ జనం తగ్గిపోతూ.. స్టాండ్స్ ఖాళీగా దర్శనమిస్తుండేవి. అరుపులు, సందడి లేకుండా సైలెంటుగా మ్యాచ్‌లు సాగిపోతుంటే... టీవీల్లో చూసే వీక్షకులకూ టెస్టులపై ఆసక్తి సన్నగిల్లిపోతోంది. ఇలాంటి సమయంలో గులాబి టెస్టును అభిమానుల కేరింతల మధ్య చూస్తుంటే వీక్షకుల్లో ఉత్సాహం వచ్చింది. ఒక ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న భావన కలిగింది. ఈ సందడి వాతావరణంలో మ్యాచ్ ఆడిన కోహ్లీ అన్ని టెస్టులూ ఇలాగే జరగాలంటున్నాడు. టెస్టుల్ని బాగా మార్కెట్ చేయాలని, జనాదరణ పెంచాలని కోరుతున్న భారత కెప్టెన్.. కొన్ని ఉదాహరణలతో కూడిన సూచనలు చేశాడు.
విరాట్ ఏమంటాడంటే..?
"టీ20లు, వన్డేల్లాగే టెస్టుల్నీ మార్కెట్ చేయడం చాలా అవసరం. బాగా ఆడటం మా కర్తవ్యం అయితే.. ఆటను జనాల్లోకి తీసుకెళ్లడం నిర్వాహకుల బాధ్యత. బోర్డుతో పాటు ప్రసారదారు కూడా ఈ దిశగా ఆలోచించాలి. టీ20ల పట్లే జనాల ఆసక్తిని పెంచి, టెస్టుల్ని వదిలేయడం సరి కాదు. ఆకర్షణ పెంచితే కచ్చితంగా టెస్టులు చూసేందుకు జనాలు స్టేడియాలకు వస్తారని" కోహ్లి అంటున్నాడు.
"పిల్లల కోసం స్టేడియాల్లో ప్రత్యేకంగా ఆట స్థలాలు పెట్టొచ్చు. అంతర్జాతీయ ఆటగాళ్లతో సరదాగా ఆడే అవకాశం కల్పించొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కానీ అవే ఆటకు మేలు చేస్తాయి. ఊరికే వచ్చి ఎండలో కూర్చుని కదలకుండా ఆట చూడటంతో సరిపెట్టకూడదు. ఒక ఈవెంట్లో పాల్గొన్న, టెస్టుల్ని ఆస్వాదించే అనుభవాన్ని వాళ్లకు ఇవ్వాలి. అప్పుడే టెస్టులకు అభిమానులు పెరుగుతారు"