న్యూజిలాండ్‌తో రెండో టీ20 అనంతరం కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్, టీమిండియా స్పిన్ బౌలర్ యుజువేంద్ర చాహల్ మధ్య ఒక హాస్యకర సంఘటన జరిగింది. మ్యాచ్ పూర్తయ్యాక గప్తిల్, రోహిత్ శర్మ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. చాహల్ వారి మధ్యకు వెళ్లి ఏం జరుగుతోందని అడిగాడు. వెంటనే గప్తిల్ చాహల్‌నుద్దేశించి హిందీలో అనకూడని ఓ మాట అన్నాడు. ఫలితంగా పక్కనే ఉన్న రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ ఘటనంతా లైవ్‌లో రికార్డు అయింది.
చాహల్‌ను హిందీలో తిట్టిన గప్తిల్.. రోహిత్ ఆనందం! - చాహల్‌ను హిందీలో తిట్టిన కివీస్ ఆటగాడు గప్తిల్
టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్.. సహచరులతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరం కివీస్ ఆటగాడు గప్తిల్‌తో సరదాగా మాట్లాడాడు చాహల్. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.
తెలిసీ తెలియని భాషలో గప్తిల్ ఆ పదం ఉపయోగించడాన్ని అక్కడున్న టీమిండియా ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో ఈ న్యూజిలాండ్ ఆటగాడు ఐపీఎల్లో ఆడాడు. ఆ సమయంలో మనవాళ్ల దగ్గరే ఆ పదాలు నేర్చుకొని ఉంటాడని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
టీమిండియా రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేసింది. అనంతరం భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్(57), శ్రేయస్ అయ్యర్(44) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ ఈ నెల 29న జరగనుంది.