ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. సోమవారం జరిగిన ఐబీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పొట్టి కప్పు వాయిదా అనివార్యమైనట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలో వరుసగా మూడేళ్లలో మూడు ప్రపంచకప్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. అందులో రెండు టీ20 ప్రపంచకప్‌లు కాగా.. ఒకటి వన్డే ప్రపంచకప్. ఈ మూడు మెగా టోర్నీలు అక్టోబరు-నవంబరు నెలల్లోనే జరగనుండడం విశేషం.
ఈ ఏడాది వాయిదా పడిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా వచ్చే ఏడాది నిర్వహిస్తుందా.. అటొచ్చే ఏడాది నిర్వహిస్తుందా అన్నది తేలలేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది భారత్ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలి. అయితే 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లను భారత్, ఆస్ట్రేలియాలు మార్చుకునే అవకాశం ఉందని ఐసీసీ సీఈవో మను సాహ్నే చెప్పాడు.
‘‘అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేశాం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు సురక్షితమైన, విజయవంతమైన రెండు టీ20 ప్రపంచకప్‌లను అందించే ఉత్తమమైన అవకాశం లభిస్తుంది. సభ్య దేశాలు తాము కోల్పోయిన ద్వైపాక్షిక సిరీస్‌లు, దేశవాళీ టోర్నీలను తిరిగి షెడ్యూల్ చేసుకునేందుకు ఐసీసీ నిర్ణయం దోహద పడుతుందని భావిస్తున్నాం’’
- మను సాహ్నే, ఐసీసీ సీఈఓ