ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత జట్టు ప్రయాణం సాగుతోంది. కఠిన ప్రత్యర్థిగా భావించే న్యూజిలాండ్‌తో మెల్బోర్న్ వేదికగా నేడు(గురువారం) తలపడనుంది హర్మన్‌సేన. ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. బంగ్లాపై 18 పరుగులతో విజయం సాధించింది. మరి కివీస్ అమ్మాయిలపై హ్యాట్రిక్ విజయం అందుకుంటుందా? ఈ సందర్భంగా కివీస్, టీమిండియా బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న ఉమెన్ టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోనుంది.
షెఫాలీ విధ్వంసం ముఖ్యం
పదహారేళ్ల డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ (39, 29 పరుగులు) దూకుడుగా ఆడుతూ జట్టుకు శుభారంభాలు అందిస్తోంది. వన్‌డౌన్‌లో జెమీమా రోడ్రిగ్స్ (26, 34).. ఆమెకు మంచి సహకారం అందిస్తోంది. వీరిద్దరూ ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఆసీస్ మ్యాచ్‌లో గాయపడ్డ ఓపెనర్ స్మృతి మంధాన బంగ్లా మ్యాచులో ఆడలేదు. ఆమె కోలుకోవడం వల్ల జట్టు బలం పెరుగుతుంది. ప్రస్తుతానికి టాప్ ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమైంది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రమే. తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండంకెల స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఫామ్‌లోకి రావాల్సి ఉంది. హర్మన్ చెలరేగితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
పూనమ్ తిప్పేయాల్సిందే
మిడిలార్డర్లోనూ టీమిండియా మెరుస్తోంది. ఆసీస్‌పై దీప్తిశర్మ 49 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె చేసిన పరుగుల వల్లే నిజానికి ఆ మ్యాచ్‌లో భారత్ పోరాడగలిగింది. బంగ్లా మ్యాచ్‌లో 20 పరుగులతో అజేయంగా నిలిచిన వేదా కృష్ణమూర్తి మెరుపులు మెరిపిస్తూ ఫామ్‌లోకి వచ్చింది. పూనమ్ యాదవ్ (7 వికెట్లు)కు తోడుగా పేసర్ శిఖా పాండే (5 వికెట్లు) బంతితో రాణిస్తుండటం సానుకూలం. అరుంధతి రెడ్డి, రాజేశ్వరీ గైక్వాడ్ సహా మిగతా బౌలర్లు వారికి అండగా నిలుస్తున్నారు.
డివైన్ అర్ధశతకాలకు బ్రేక్!