టీ20 వరల్డ్‌కప్ కోసం వీసాల మంజూరు విషయంపై హామీ ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్ తమను ఆశ్చర్యానికి గురి చేసిందని బీసీసీఐ తెలిపింది. ఈ తరహా వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవని పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. 'టోర్నీ సందర్భంగా తమ ఆటగాళ్లు, జర్నలిస్టులు, అభిమానులకు వీసాలు మంజూరు చేయాలి' అని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఐసీసీకి ఓ లేఖను రాశారు.
"ఎహ్సాన్ మణి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయనకు సౌరభ్ గంగూలీతో మంచి వృత్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయనొక పెద్ద మనిషి. కరోనా సమయంలో సౌరభ్‌కు మార్గదర్శిగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు అపరిపక్వతతో కూడినవని భావించొచ్చు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు.