టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్ బౌలింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మిడిల్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చినా.. చివర్లో పుంజుకున్న విధానం తనకు బాగా నచ్చిందని అన్నాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు అవసరమని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌లో నటరాజన్ పరిణతి చెందుతున్నాడని కితాబిచ్చాడు. ఐపీఎల్13వ సీజన్లో అతడు యార్కర్లను బాగా సంధించాడని పొగిడాడు.
ఈ పోరు నటరాజన్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇందులో పది ఓవర్లు వేసిన ఇతడు.. 70 పరుగులు సమర్పించుకుని లబుషేన్, అగర్‌ను పెవిలియన్ చేర్చాడు. తొలి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసి ఓ మెయిడెన్ సాయంతో 21 పరుగలు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. రెండో స్పెల్‌లో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో స్పెల్ తొలి ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. నాలుగో స్పెల్‌లో మొదటి ఓవర్లోనూ(అతడి ఎనిమిదో ఓవర్) 18పరుగులు ఇచ్చి అగర్ వికెట్ దక్కించుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐపీఎల్ 13వ సీజన్లోనూ 16వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు.