సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్ కోసం తమిళనాడు, బరోడా జట్లు తలపడనున్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో రాజస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది తమిళనాడు. 89 పరుగులు చేసి ఆ జట్టుకు అద్వితీయ గెలుపును అందించాడు అరుణ్ కార్తీక్. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ అశోక్ మెనారియా(51), ఏఆర్ గుప్తా(45) రాణించారు. తమిళనాడు బౌలర్లు మహ్మద్ 4, సాయి కిశోర్ 2 వికెట్లు తీసి రాజస్థాన్‌ను కట్టడి చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఓ దశలో 17/2 వద్ద నిలిచింది. అయితే జగదీశన్(28)తో కలిసి అరుణ్(89*) ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. ఆ తర్వాత జగదీశన్‌ను రవి బిష్ణోయ్ బోల్తా కొట్టించగా సారథి దినేశ్ కార్తీక్(26*)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు అరుణ్.
రెండో సెమీఫైనల్లో పంజాబ్‌పై 25 పరుగుల తేడాతో గెలిచింది బరోడా. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బరోడా.. కేదార్ దేవ్‌ధర్ (64), కేఆర్ కాకడే(53) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. వెంటవెంటనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. గుర్కీరత్ మన్(39), మన్దీప్ సింగ్(42) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే మెరివాలా (3 వికెట్లు) ధాటికి 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్.
తమిళనాడు, బరోడా జట్లు జనవరి 31న జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలోనే జరగనుంది.
ఇదీ చూడండి:భారత్-ఇంగ్లాండ్ సిరీస్.. టాప్-3లో ఎవరు బెస్ట్?