మేఘాలయ ఆల్‌రౌండర్ అభయ్ నేగి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీలో వేగంగా అర్ధశతకం బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై అతడు 14 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. ఫలితంగా దేశవాళీలో రాబిన్ ఉతప్ప పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ రికార్డునూ సమం చేశాడు.
భారత్‌లో జరిగిన టీ20ల్లో వేగంగా అర్ధశతకం బాదిన ఆటగాడిగా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. 2018లో మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించి కేఎల్ రాహుల్.. దిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఘనత సాధించాడు.
మిజోరం బౌలర్లపై రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగిన అభయ్... ఐపీఎల్ 2020 వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని అందరూ భావిస్తున్నారు. అభయ్‌తో పాటు రవితేజ (53) కూడా అర్ధశతకంతో రాణించడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మిజోరం... రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులే చేసింది. మిజోరం బ్యాట్స్‌మన్‌లు కోహ్లీ (90), పవన్ (72*) పోరాడినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఫలింతంగా మేఘాలయ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉత్తరాఖండ్‌కు చెందిన అభయ్ నేగి... మేఘాలయ, త్రిపుర తరఫున ఆడాడు. గతేడాది నవంబర్‌లో తన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో అరగేట్రం చేశాడు. టీ20ల్లోనూ అదే ఏడాది జనవరిలో బెంగాల్‌పై ఆడాడు.