దేశవాళీ టీ20 టోర్నీ 'సయ్యద్ ముస్తాక్ అలీ' జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. గతేడాదే జరగాల్సింది కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. అయితే ఈ టోర్నీలో అదరగొట్టే ప్రదర్శన చేసి, సెలక్టర్ల దృష్టిలో పడాలని కొందరు యువ ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
By
Published : Jan 3, 2021, 5:01 PM IST
కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన క్రికెట్ పోటీలన్నీ వాయిదా పడ్డాయి. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు మెగా, దేశవాళీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాలేదు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో వాటి నిర్వహణకు సన్నాహకాలు మొదలయ్యాయి. తొలుత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో పాల్గొనున్న కొందరు యువ ఆటగాళ్లపై అందరీ దృష్టి నెలకొంది. ఇంతకీ వారెవరు?
దేవదత్ పడిక్కల్
గత ఐపీఎల్లో బాగా ఆడి ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచాడు ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్. టోర్నీ ఆసాంతం చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకుని, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తోన్న దేవదత్.. జాతీయ జట్టులో చోటు కోసం శ్రమిస్తున్నాడు.
దేవదత్ పడిక్కల్
ఇషాన్ కిషన్
ఐపీఎల్లో ముంబయి తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు ఇషాన్ కిషన్. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధోనీ సొంత రాష్ట్రానికి ఆడుతున్న ఇషాన్.. అతడిలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. గతేడాది మహీ రిటైర్మెంట్ ప్రకటించడం, పంత్ వరుస వైఫల్యాలతో విసిగిపోయిన బీసీసీఐ.. దీర్ఘకాల కీపర్, బ్యాట్స్‌మన్ కోసం చూస్తోంది. ఈ స్థానం కోసం ఇషాన్ పోటీలో ఉన్నాడు.
ఇషాన్ కిషన్
సూర్యకుమార్ యాదవ్
భారత యువ ఆటగాళ్లలో ఉత్తమ క్రికెటర్లో ఒకడిగా సూర్యకుమార్ యాదవ్‌ను చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్నా సరే జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. గత ఐపీఎల్‌లోనూ ముంబయి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వలేదు. దీంతో అభిమానులు బీసీసీఐపై విమర్శలు చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయికి కెప్టెన్‌గా ఉన్న సూర్య.. ఈ టోర్నీలోనూ సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు.
సూర్య కుమార్ యాదవ్
రవి బిష్ణోయ్
యువ బౌలర్ రవి బిష్ణోయ్ గత ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. స్పిన్ విభాగంలో కీలకపాత్ర పోషించాడు. త్వరలోనే జాతీయ జట్టులోకి రాగలిగే సత్తా ఉన్న ఇతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చూడదగిన ఆటగాళ్లలో ఒకడు.
రవి బిష్ణోయ్
రుతురాజ్ గైక్వాడ్
గత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రుతురాజ్.. తొలి అర్ధభాగంలో అవకాశాలు రాక సతమతమయ్యాడు. చివర్లో వరుస మ్యాచ్‌ల్లో చోటు దక్కించుకుని తానెంటో నిరూపించాడు. ధోనీ లాంటి కెప్టెన్ కూడా ఇతడి బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తరఫున ఆడనున్నాడు. వచ్చే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌ను గొప్పగా ముగించాలని భావిస్తున్నాడు.