అశ్విన్:
సిడ్నీలో మేం మ్యాచ్ గెలవలేదు. అలా అని ఓడిపోనూ లేదు. కానీ సిడ్నీ టెస్ట్ డ్రా.. విజయం కన్నా గొప్పది. దానికి దారి తీసిన కారణాలు చాలానే ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది క్వారంటైన్. సిడ్నీ టెస్ట్ ప్రారంభానికి ముందే క్వారంటైన్.. జట్టును సందిగ్ధ పరిస్థితుల్లో నెట్టేసింది. ఆస్ట్రేలియా టూర్‌కు పిలిచే ముందు వాళ్లు చెప్పింది ఒక్కటే.. మూడున్నర నెలల పాటు మీరు బబుల్‌లో ఉన్నట్లే. 14 రోజులు క్వారంటైన్లో ఉండండి..ఆ తర్వాత మీరు కాఫీ తాగొచ్చు, బయటికి వెళ్లొచ్చంటూ ఏవేవో చెప్పి సిరీస్‌కు రప్పించారు. ఇక్కడ మెల్బోర్న్లో గెలిచి 1-1తో సిరీస్ సమం చేశాక పరిస్థితులు మారిపోయాయి. రూం నుంచి బయటకు రావొద్దంటూ కఠిన ఆంక్షలు విధించారు. మీడియా మమ్మల్ని వెంటాడింది.
శ్రీధర్:
ఇది ఒక ఎత్తు. దుబాయ్‌లో ఐపీఎల్ ముగింపు దశలో ఉన్నాం. ఇంకో కొద్దిరోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్తున్నాం అన్న సమయంలో.. ఆటగాళ్లతో వారి కుటుంబాలు ఉండటానికి వీలు లేదంటూ ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఇప్పించారు. టూర్ ప్రారంభం కాకుండానే జట్టును స్లెడ్జ్ చేయటానికి ఇలాంటివి చేస్తూ ప్రత్యర్థులను ఉసిగొల్పటం ఆసీస్‌కు మామూలే.
అశ్విన్:
ఆసీస్ పర్యటనకు కుటుంబసభ్యులకు అనుమతి లేదని నా భార్యకు చెప్పాను. నేనింక వేరేదారి చూసుకోనా మరి అంటూ తను వేళాకోళమాడింది. ఆరునెలల పాటు కుటుంబానికి దూరంగా ఎవరైనా ఉండగలరా..? ఇదేమన్నా వనవాసమా అర్థం కాలేదు.
శ్రీధర్:
ఏడుగురు ఆటగాళ్లు తమ కుటుంబంతో సహా సిద్ధమైపోయి ఉన్నారు. వాళ్లకు పరిస్థితి ఇదని ఎలా చెప్పగలం. రవిశాస్త్రి ఆ సమయంలో ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆటగాళ్లను కుటుంబాలతో సహా అనుమతించకపోతే టూర్‌కు రామని, రద్దు చేసుకుంటామని రవిశాస్త్రి తెగేసి చెప్పాడు. దాంతో ఆసీస్ బోర్డు పునరాలోచనలో పడింది. తప్పేది లేక ప్రభుత్వంతో మాట్లాడి కుటుంబాలను అనుమతించింది.
అశ్విన్:
ఎందుకో తెలియదు సిడ్నీలో బబుల్ నిబంధనలు చాలా విచిత్రంగానూ, అనుమానాస్పదంగానూ అనిపించాయి. ఆసీస్, భారత ఆటగాళ్లు ఒకే బబుల్‌లో ఉంటున్నారు. అలాంటప్పుడు ఆసీస్ ఆటగాళ్లు వాడిన లిఫ్ట్‌లను భారత ఆటగాళ్లు ఉపయోగించకూడదంటూ ఆదేశాలివ్వటం దేనికి సంకేతమో అర్థం కాలేదు. అలాంటి కఠిన పరిస్థితులను తట్టుకున్నాం. గబ్బాకు భారత్ రావటం లేదంటూ మరో నాటకానికి తెరతీశారు. అన్నీ ఓపికగా, సహనంగా ఎదుర్కొన్నాం.
శ్రీధర్:
మొత్తానికి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఆసీస్ ఆటగాళ్లు బ్యాటింగ్ తీసుకున్నారు. మొదటిరోజు తొలి అర్ధం పూర్తయ్యేటప్పటికీ 160/2 స్కోరు ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. తర్వాతి రోజు మన వాళ్ల ఫీల్డింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. రహానె అద్భుతమైన క్యాచును అందుకున్నాడు. జడేజా కళ్లు చెదిరే త్రోతో స్మిత్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. స్పిన్నర్లు లయ అందుకోవటం వల్ల 338 పరుగులకు ఆసీస్‌ను నియంత్రించగలిగాం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సులువుగా 600 పరుగులు చేయగలిగే వికెట్ అది. అలాంటిది మన బౌలర్లు బాగా ఆకట్టుకున్నారు.
అశ్విన్:
రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి ఒకే ఇన్నింగ్స్ లో మూడు రనౌట్లు చేయటం 110 సంవత్సరాల రికార్డని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు. కానీ గర్వపడొద్దని చెప్పాడు. కానీ పరిస్థితి దారుణంగా ఉంది. డ్రెస్సింగ్ రూమా లేదా ఆసుపత్రి వార్డ్‌లో ఉన్నామా తెలియదన్నట్లు ఆటగాళ్లకు ఎటు చూసినా గాయాలే.
శ్రీధర్:
కనీసం కోచ్‌లకు ప్రత్యేకంగా రూం కేటాయించలేదు. ఆటగాళ్ల గదిలోనే కోచ్ బృందాన్ని కూర్చోమన్నారు. మ్యాచ్ చూసేందుకు సరైన అవకాశమే లభించలేదు. గిల్, పుజారా ఆదుకోవటం వల్ల 244 పరుగులు చేశాం. ఆసీస్ త్వరగా ఆడి డిక్లేర్ ఇచ్చేసింది.
అశ్విన్:
చివరి రెండురోజుల భారత పోరాటానికి నిదర్శనం. డ్రెస్సింగ్ రూంలో ఉన్న మీ ఫీలింగ్స్ ఏంటి?
శ్రీధర్:
నా జీవితంలో సిడ్నీ టెస్టు మ్యాచ్ రోజులు గుర్తుండిపోతాయి. ప్రత్యేకించి ఛెతేశ్వర్ పుజారా 205 బంతులు ఎదుర్కోవటం ఓ అద్భుతం.