ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును డ్రాగా ముగించడంపై హర్షం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానె. ఈ ఫలితాన్ని తాము విజయంగా భావిస్తున్నట్లు అన్నాడు. ఈ పోరులో ప్రతి ఆటగాడు తమ వంతు కృషి చేశాడని జట్టును అభినందించాడు.
"ఈ టెస్టులో మేము గెలిచామని భావిస్తున్నాం. విదేశీ గడ్డపై మ్యాచులను ఇలా ఆడితేనే ప్రత్యేకంగా ఉంటుంది. పుజారా, రోహిత్, పంత్ బాగా ఆడినప్పటికీ ముఖ్యంగా ఈ ఘనతంతా అశ్విన్, విహారిలకే చెందుతుంది. చివరి 2.5గంటల్లో వారు చేసిన బ్యాటింగ్ అమోఘం" అని రహానె అన్నాడు.
"ఈ పోరులో విహారి 161 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెమ్మదైన ఇన్నింగ్స్ విహారి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. గత మూడు టెస్టుల నుంచి విహారి చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు భారీ స్కోరు చేయనప్పటికీ కానీ ఈ రోజు చాలా బాగా ఆడాడు. అతడి కెరీర్లో సెంచరీ చేసిన దాని కన్నా ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గాయపడినప్పటికీ అతడు ఆడిన బ్యాటింగ్ చేసిన విధానం మిగతా ఆటగాళ్లలో స్ఫూర్తినిచ్చింది. జట్టు కోరుకున్నది సాధించాడు. అందుకే ఈ ఘనతంతా అతడికే సొంతం. కాగా, ఆస్ట్రేలియాకు వరల్డ్ క్లాస్ బౌలింగ్ విభాగం ఉంది. ఆ జట్టులో ఉన్న ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు గొప్ప ఆటగాళ్లు. వారు వ్యక్తిగతంగా కాకుండా జట్టు కోసం చివరిదాకా పోరాడారు. వారిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను."