స్విచ్ హిట్టింగ్‌ను నిషేధించాలని ఐసీసీకి సూచించారు ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్. బౌలర్, ఫీల్డింగ్ జట్టు విషయంలో ఈ షాట్ అన్యాయకరమైనదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో మ్యాక్స్‌వెల్, వార్నర్‌లు టీమ్ఇండియా బౌలింగ్ పలుమార్లు స్విచ్ షాట్లు ఆడారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు చాపెల్.
"భారత్‌తో వన్డే సిరీస్‌లో ఆసీస్ బ్యాటింగ్ అసాధారణంగా ఉంది. బ్యాట్స్‌మెన్ తేలికగా పరుగులు రాబడుతున్నారు. మ్యాక్స్‌వెల్ నమ్మశక్యం కాని షాట్లు ఆడాడు. అందులో స్విచ్ షాట్ ఒకటి. అది అద్భుత నైపుణ్యంతో కూడుకున్నది. కానీ అన్యాయకరమైనది. దీన్ని నిషేధించాలి. మ్యాక్స్‌వెల్‌తో పాటు వార్నర్ కూడా స్విచ్ షాట్ ఆడాడు. బౌలర్ రనప్ కంటే ముందే బ్యాట్స్‌మన్ స్విచ్ షాట్‌కు సిద్ధమై.. స్టాన్స్ మార్చుకుంటే సమస్య లేదు. బౌలర్ కూడా అందుకు తగ్గట్టుగా బంతి వేస్తాడు. కానీ బౌలర్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతి వేసేందుకు సిద్ధమవుతుండగా.. బ్యాట్స్‌మన్ తన చేతులు లేదా కాళ్ల క్రమాన్ని మార్చి షాట్ ఆడటం అన్యాయం. కెప్టెన్ కూడా ఆటగాడి బాటింగ్ శైలికి తగినట్టుగా ఫీల్డింగ్ అమర్చి ఉంటాడు. కానీ ఆ బ్యాట్స్‌మన్ ఉన్నట్టుండి స్విచ్ షాట్ ఆడి లబ్ధి పొందడం న్యాయం ఎలా అవుతుందో క్రికెట్ పాలకులు చెప్పాలి."