తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయికే షాకిచ్చి.. అదే జట్టులో చేరి - ఐపీఎల్ వార్తలు

ఐపీఎల్​, దేశవాళీ క్రికెట్​లో సత్తా చాటూతూ.. టీమ్​ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్​ యాదవ్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

surya kumar yadav special story
ముంబయికే షాకిచ్చి.. అదే జట్టులో చేరి

By

Published : Oct 29, 2020, 2:35 PM IST

ముంబయి బ్యాట్స్‌మన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్‌ను తొలుత ఆ జట్టే పక్కనపెట్టింది. 2012లోనే అతడిని కొనుగోలు చేసినా అవకాశం ఇవ్వలేకపోయింది. 2014లో కోల్‌కతా తీసుకోగా 2015లో అతడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. తనను పక్కనపెట్టిన ముంబయిపైనే వాంఖడే స్టేడియంలో చెలరేగి తొలిసారి ఆ జట్టుకు షాకిచ్చాడు. దాంతో కోల్‌కతా టీమ్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సొంత గూటికే చేరుకున్నాడు. గత మూడు సీజన్లలోనూ నిలకడగా రాణిస్తూ తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు. అయితే, అతడెంత మంచి ప్రదర్శన చేసినా టీమ్‌ఇండియాకు మాత్రం ఎంపిక కాలేకపోతున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం వల్ల నిరాశ చెందిన ముంబయి బ్యాట్స్‌మన్‌.. గతరాత్రి జట్టును గెలిపించి 'నేనున్నా'ననే సైగలు చేశాడు. అతడి గురించి మరిన్ని విశేషాలు మీకోసం..

మధ్య తరగతి కుటుంబం.. తండ్రి ప్రోత్సాహం..

సూర్యకుమార్‌ది ముంబయి సమీపంలోని చెంబూర్‌ ప్రాంతం. అతడిది మధ్యతరగతి కుటుంబం. పదేళ్ల వయసులో వీధుల్లో క్రికెట్‌ ఆడటం చూసిన తండ్రి.. ఓ క్రికెట్‌ క్యాంప్‌లో చేర్పించాడు. దాంతో మెల్లగా ఆటలో రాటుదేలి తర్వాత దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అకాడమీలో చేరాడు. ఇక అక్కడి నుంచి తన క్రికెట్‌ ప్రయాణం మొదలైంది. ముంబయి తరఫున అన్ని వయసుల కేటగిరీల్లో సత్తా చాటుతూ 2010-11 సీజన్‌లో తొలిసారి రంజీలో పాల్గొన్నాడు. అప్పుడే ముంబయి తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచి తర్వాత పర్మనెంట్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

సూర్యకుమార్ యాదవ్

ముంబయికే షాకిచ్చాడు..

రంజీల్లో నిలకడగా ఆడుతున్న అతడిని 2012లోనే ముంబయి జట్టు టీ20 లీగ్‌ వేలంలో కొనేసింది. అప్పటికే ఆ జట్టులో సీనియర్లు చాలా మంది ఉండడం వల్ల అడపాదడపా అవకాశాలు వచ్చాయి. అయినా, చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఆపై 2014లో కోల్‌కతా అతడిని కొనుగోలు చేసింది. యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సూర్యను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలోనే 2015లో అతడు ముంబయిపైనే చెలరేగిపోయాడు. 20 బంతుల్లో 46 పరుగులు చేసి కోల్‌కతాను గెలిపించడమే కాకుండా ముంబయికి షాకిచ్చాడు. అలా తొలిసారి తన సత్తా చాటాడు. దాంతో ఆ సీజన్‌లో కోల్‌కతా తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే 2016, 17 సీజన్లలో రాణించకపోయినా ముంబయి మళ్లీ అతడిని 2018లో తీసుకుంది. ఇక అప్పటి నుంచీ దశ తిరిగిన అతడు నిలకడగా రాణిస్తున్నాడు. 2018లో ముంబయి తరఫున టాప్‌ స్కోరర్‌గా 512 పరుగులు చేశాడు. 2019లో 424 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 362 పరుగులు చేసి దిగ్విజయంగా సాగుతున్నాడు.

సూర్యకుమార్ యాదవ్

టీ20ల్లో స్ట్రైక్‌రేటే అతడి బలం..

టీ20 క్రికెట్‌ అంటేనే దంచికొట్టడం. ఫోర్లు, సిక్సర్లతో అలరించడం. బౌలర్‌ ఎవరైనా బంతిని స్టాండ్స్‌లోకి తరలించడమే పనిగా పెట్టుకోవాలి. అందులో సూర్య సిద్ధ హస్తుడు. తన బ్యాటింగ్‌లో ఎక్కువ శాతం బౌండరీలకే ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే అతడు అత్యుత్తమ టీ20 క్రికెటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అందుకు నిదర్శనం అతడి స్ట్రైక్‌రేటే. ఇప్పటివరకు మొత్తం 161 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌‌ 140.70 స్ట్రైక్‌రేట్‌తో 3,374 పరుగులు చేశాడు. ఐపీఎల్​లోనే కాకుండా దేశవాళీ క్రికెట్‌లోనూ ముంబయి తరఫున అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లోనూ ఒత్తిడిని చిత్తు చేసి ఆడుతున్నాడు. అయినా, టీమ్‌ఇండియాకు ఎంపిక చేయకపోవడం వల్ల బాధలో ఉన్నాడు. అతడి ప్రదర్శన చూసిన మాజీలు.. సూర్యను ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్థం కావడం లేదని పెదవి విరుస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్లు అతడిని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

మెగా లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌..

గత మూడేళ్లుగా రోహిత్‌ సేన తరఫున నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్‌.. నాలుగుసార్లు 70కి పైగా పరుగులు చేశాడు. అందులో మూడుసార్లు ముంబయి విజయం సాధించగా కేవలం ఒక్కసారి మాత్రమే ఓటమిపాలైంది. బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్​లో 43 బంతుల్లోనే 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన అతడు.. ఇంతకుముందు రాజస్థాన్‌తో తలపడినప్పుడు 47 బంతుల్లో అన్నే పరుగులు చేశాడు. ఇక 2018లో రాజస్థాన్‌పై 72 పరుగులు, 2019లో చెన్నైపై 71 పరుగులు చేశాడు. మరోవైపు నిన్నటి ఇన్నింగ్స్‌ చూసిన నెటిజన్లు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి మేటి క్రికెటర్‌ను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయకపోవడంపై రుసరుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ట్విటర్‌లో స్పందిస్తూ.. సూర్యకుమార్‌ సహనంతో ఎదురు చూడాలని సూచించాడు.

సూర్యకుమార్ యాదవ్

ABOUT THE AUTHOR

...view details