స్వదేశంలో టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది న్యూజిలాండ్ జట్టు. ఇవాళ జరిగిన మూడో టీ20లో పరాజయం చెంది సిరీస్‌ను 0-3తో టీమిండియాకు అప్పగించింది. తొలి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోని కివీస్.. మూడో టీ20లో మాత్రం గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. ముఖ్యంగా సారథి కేన్ విలియమ్సన్ అద్భుతంగా రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే తాజా ఓటమిపై స్పందించాడు విలియమ్సన్. సూపర్ ఓవర్‌లు వారికి స్నేహితులు కాదని అభిప్రాయపడ్డాడు.
"మాకు సూపర్ ఓవర్‌లు కలసి రావడం లేదు. అవి మాకు నిజంగా స్నేహితులు కాదు. అందుకే మేము మామూలు మ్యాచ్‌ల్లోనే గెలవాలి. క్రికెట్ ఎంతో గొప్ప ఆట. ఏ చిన్న తప్పు దొర్లినా విజేత మారిపోతారు. కీలక సమయంలో టీమిండియా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈ విషయంలో మేము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాలి. టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా మా బౌలర్లు తిరిగి పుంజుకొని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ రోజు నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలు నమోదు చేశాను. కానీ మ్యాచ్‌ను విజయంతో ముగించకపోవడం దురదృష్టకరం. ఓటమి గురించి సభ్యులతో చర్చించుకోవాలి. మేము మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా ఒత్తిడిలో జయించడం నేర్చుకోవాలి".