తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ ఐపీఎల్​లో బౌలర్లదే హవా.. భారీ స్కోర్లు కష్టమే'

ప్రస్తుత ఐపీఎల్​లో మొత్తం బౌలర్ల హవానే సాగుతుందని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు మార్గనిర్దేశకుడు వీవీఎస్​ లక్ష్మణ్​. దాదాపు ఐదు నెలలు విరామం వచ్చినా.. ఆటగాళ్లందరూ ఫిట్​గా ఉండటం చూస్తే ఆశ్చర్యమేసిందని తెలిపాడు. టోర్నీ కోసం క్రికెటర్లంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

By

Published : Sep 16, 2020, 8:15 AM IST

Sunrisers Hyderabad Mentor VVS Laxman Special interview From UAE
ఈసారి బౌలర్లదే హవా: వీవీఎస్​ లక్ష్మణ్​

సమష్టిగా కృషి చేయడమే తమ జట్టు విజయ రహస్యమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్గనిర్దేశకుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఈనెల 19న ప్రారంభంకానున్న ఐపీఎల్‌ కోసం సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్‌లో బయో బబుల్‌లో ఉంటూ సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల సాధనను పర్యవేక్షిస్తూ, టోర్నీకి వ్యూహాల్ని రచిస్తున్న లక్ష్మణ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.

వీవీఎస్​ లక్ష్మణ్​

ఐపీఎల్‌ బయో బబుల్‌ వాతావరణం ఎలా ఉంది? క్రికెటరు అలవాటుపడ్డారా?

కరోనా కారణంగా ఐపీఎల్‌ జరుగుతుందా లేదా అని ఆందోళన చెందాం. ఐపీఎల్‌ లేకపోవడం కంటే జాగ్రత్తల నడుమ నిర్వహించడం మంచిదే. ప్రత్యేక పరిస్థితుల్లో యూఏఈలో జరుగుతున్న ఈ ఐపీఎల్‌ కోసం బీసీసీఐ, అన్ని ఫ్రాంచైజీలు చక్కగా ఏర్పాట్లు చేశాయి. దుబాయ్‌కి రాకముందు భారత్‌లో మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. దుబాయ్‌లో మళ్లీ పరీక్షలు, క్వారంటైన్‌ అనంతరం సాధనకు అనుమతిచ్చారు. బయటకు వెళ్లలేమన్న మాటే కానీ.. మిగతావన్నీ మామూలే. ప్రత్యేకంగా రెస్టారెంట్‌, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఆట స్థలం ఉన్నాయి. గాలి, వెలుతురు వచ్చేలా అన్ని గదులకు బాల్కనీలున్నాయి. బబుల్‌లోని ప్రతి ఒక్కరికి ట్రాకర్‌లు ఇచ్చారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అందులో అన్నీ రికార్డవుతాయి. మొదట్లో కొత్తగా అనిపించింది. ఇప్పుడు అలవాటైపోయింది.

కరోనా, బయో బబుల్‌ ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపుతున్నాయా?

కరోనా తీవ్రత దృష్ట్యా బబుల్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలపై అందరం సంతృప్తిగా ఉన్నాం. అయితే గతంలో మాదిరిగా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు. ఇంతకుముందు ఐపీఎల్‌లలో బాగా ఆడని.. ఫామ్‌లో లేని ఆటగాళ్లు సరదాగా బయటకు వెళ్లడం, సేదతీరడం చేస్తుండేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కష్టమే అయినా తప్పదు. ఒకరకంగా ఇదీ సానుకూలాంశమే. ఆటగాళ్లు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపొచ్చు. వారి మధ్య మంచి వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ అందరినీ కలవొచ్చు. ఒంటరితనం అన్న మాటే లేదు. క్రీడాకారుల జీవితంలో పర్యటనలు సహజం. ఇంటికి దూరంగా ఉండటం అలవాటే. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఎక్కడున్నా అందరినీ చూడొచ్చు. అందరితో మాట్లాడొచ్చు.

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ సాధించారా?

లాక్‌డౌన్‌లో చాలామంది ఆటగాళ్లు ఇళ్లలోనే వ్యాయామాలు చేశారు. దుబాయ్‌కి వచ్చాక ఫిట్‌నెస్‌ దిశగా కసరత్తులు మొదలుపెట్టాం. ఆశ్చర్యకరంగా అందరూ ఫిట్‌గానే ఉన్నారు. వారి శారీరక దారుఢ్యంలో, నైపుణ్యంలో ఎలాంటి మార్పు లేదు. అత్యున్నత స్థాయి క్రీడాకారుల సామర్థ్యాల్ని తాత్కాలిక విరామాలు దెబ్బతీయలేవని రుజువైంది. మొదటి వారం పూర్తిగా ఫిట్‌నెస్‌, ట్రైనింగ్‌కు కేటాయించాం. ఇప్పుడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాం. జట్టును రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాం. ఐపీఎల్‌ ఆరంభం వరకు మ్యాచ్‌ ప్రాక్టీస్‌, జట్టు కూర్పుపై దృష్టాసారిస్తాం. టామ్‌ మూడీ స్థానంలో ట్రెవర్‌ బేలిస్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. శ్రీలంక, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్‌గా అతను సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌కు తొలి ప్రపంచకప్‌ అందించాడు. బేలిస్‌ ఆధ్వర్యంలో సన్‌రైజర్స్‌ సత్తాచాటుతుందనడంలో అనుమానం లేదు. బ్యాటింగ్‌ కోచ్‌గా బ్రాడ్‌ హడిన్‌ కూడా సమర్థంగా పని చేస్తున్నాడు.

వీవీఎస్​ లక్ష్మణ్​

యూఏఈ పిచ్‌లు ఎలా ఉన్నాయి. ఎవరి హవా చూడొచ్చు?

ఈసారి ఐపీఎల్‌ బౌలర్లదే. దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. కేవలం మూడు వేదికల్లోనే మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి ప్రథమార్ధం ముగిసేలోపు పిచ్‌లు జీవం కోల్పోతాయి. బాగా నెమ్మదిస్తాయి. పరుగులు రాబట్టడం.. భారీ స్కోర్లు సాధించడం కష్టమవుతుంది. ఇలాంటి పిచ్‌లపై స్పిన్నర్లదే కీలకపాత్ర. పేసర్లు స్లో బంతులతో వైవిధ్యం చూపిస్తే ఫలితాలు రాబట్టొచ్చు. అయితే ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలతో బరిలో దిగుతారు. మూడు వేదికల్లో పిచ్‌లపై పూర్తి అంచనాతోనే ఆడతారు. పరుగులు రాబట్టే మార్గాన్ని కచ్చితంగా అన్వేషిస్తారు.

ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ అవకాశాలెలా ఉన్నాయి?

సన్‌రైజర్స్‌ది ఎప్పుడూ సమష్టి ప్రదర్శనే. ఏ ఒక్కరిపైనో ఆధారపడదు. జట్టులోని ఆటగాళ్లంతా కీలకమే. గతంలో మాదిరే ఈసారి కూడా వార్నర్‌, బెయిర్‌స్టో మంచి ప్రదర్శన చేస్తారని అనుకుంటున్నాం. విలియమ్సన్‌ అనుభవం జట్టుకు పెట్టని కోట. దేశవాళీ క్రికెట్లో మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌ సత్తాచాటారు. భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌శర్మల పేస్‌ సన్‌రైజర్స్‌కు తిరుగులేని బలం. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ సన్‌రైజర్స్‌ జట్టు తరుపు ముక్క. యూఏఈ వికెట్లపై అతను ఎంతో ప్రభావం చూపగలడు. విజేతగా నిలిచేందుకు సన్‌రైజర్స్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అన్ని జట్లు టైటిల్‌ సాధించగలవే. ఒక జట్టు ఎక్కువ మరో జట్టు తక్కువ అని చెప్పలేం.

అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా దురదృష్టవశాత్తు చెన్నై జట్టులో పాజిటివ్‌ కేసులు బయటికొచ్చాయి. లీగ్‌ ప్రారంభానికి ముందే ఇలా జరగడం ఒకరకంగా మంచికే. దీని తర్వాత అన్ని జట్లూ మరింత జాగ్రత్తగా వహించాయి.

ABOUT THE AUTHOR

...view details