తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్‌పై భారతీయుల్లోనూ కొందరికి ఏడుపెందుకో..?' - ఐపీఎల్​ వార్తలు

ఐపీఎల్‌ అంటే విదేశీయులకే కాదు.. భారతీయుల్లో కూడా కొందరికి ఎందుకంత అసూయ అని ప్రశ్నిస్తున్నారు దిగ్గజ క్రికెటర్​ సునీల్‌ గావస్కర్‌. ఇంగ్లాండ్‌ బయో బబుల్‌ పద్ధతిలో ఆడుతున్న సిరీస్‌లకు.. ఐసీసీ స్థానిక అంపైర్లను కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఆసక్తికర అంశాలపై సన్నీ రాసిన వ్యాసం 'ఈనాడు'కు ప్రత్యేకం. మీరూ చదివేయండి మరి..

sports gavaskar news
ఐపీఎల్‌పై వాళ్లకు ఏడుపెందుకో..?

By

Published : Aug 11, 2020, 6:53 AM IST

ప్రపంచం కొవిడ్‌-19తో పోరాటాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు బీసీసీఐ చాలా ఏళ్లుగా 'అసూయ' అనే వైరస్‌తో పోరాడుతోంది. 2008లో వచ్చిన ఈ వైరస్‌.. ఏటా వచ్చి పోతుంది. ఐపీఎల్‌ మొదలవడానికి ముందు మొదలై.. అది ముగిసిన రెండు వారాల దాకా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న అయిదు క్రీడా ఈవెంట్లలో ఒకటిగా ఐపీఎల్‌ ఎదిగింది. అది ఇంకా పెద్ద స్థాయికి వెళ్లేదేమో కానీ.. ఈ అసూయ అనే వైరస్‌ దాన్ని అడ్డుకునేందుకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ప్రయత్నిస్తుంటుంది.

పేరు కోసం ప్రయత్నాలు..

ఎవరో అనామకుడు వచ్చి ఐపీఎల్‌ మీద 15 నిమిషాలు మాట్లాడి పేరు తెచ్చుకోవాలని చూస్తాడు. దాని మీద ఒక వ్యాసం రాయడం ద్వారానో, ఏదైనా పిటిషన్‌ వేయడం ద్వారానో ప్రచారం పొందాలని ప్రయత్నించేవాళ్లు ఎంతమందో. పేరున్న వాళ్లు కూడా ఏదో ఒక వివాదం రాజేయాలని చూస్తుంటారు. తమ నగరంలోని ఐపీఎల్‌ ద్వారా ఉపాధి పొందుతున్న వాళ్లు దెబ్బ తింటారని తెలిసినా సరే వాళ్లీ ప్రయత్నం ఆపరు. విషాదం ఏంటంటే.. ఈ వైరస్‌ భారతీయుల్ని కూడా కమ్మేసి, ప్రపంచ స్థాయిలో పేరొందిన లీగ్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంటారు.

ఐరోపా దేశాల్లో ఫుట్‌బాల్‌ లీగ్‌ల గురించి అక్కడి వాళ్లు ప్రతికూలంగా ఒక్క మాట మాట్లాడ్డం ఎప్పుడైనా విన్నారా? ఆట నచ్చని వాళ్లు కూడా చాలా మంది మ్యాచ్​లను ఆస్వాదిస్తున్నారు. దాని మీద ఎంతోమంది బతుకుతున్నారు అనే ఉద్దేశంతో ఏమీ మాట్లాడరు. కానీ మన దగ్గర అలా కాదు.

అంపైర్లను తీసుకురాలేకపోయారా.?

ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్‌ పునఃప్రారంభమైంది. ఆ జట్టు ఆరు టెస్టుల్లో నాలుగు ఆడేసింది. అందులో మూడు గెలిచింది. ఈ విజయాలతో పాయింట్ల సంఖ్య పెంచుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపరుచుకుంటోంది. పాక్‌తో సిరీస్‌ కూడా అయ్యేసరికి ఆ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుందేమో. అయితే ఈ సిరీస్‌కు ఐసీసీ స్థానిక అంపైర్లనే కేటాయించడంలో మర్మమేంటో అర్థం కావడం లేదు.

వెస్టిండీస్‌ నుంచి 25 మంది, పాకిస్థాన్‌ నుంచి 30 మంది ఆటగాళ్లు.. ఇంగ్లాండ్‌కు వచ్చి బయో బబుల్‌లో ఉండి సిరీస్‌లు ఆడుతున్నారు. వీరికి తోడు సహాయ సిబ్బందీ వచ్చారు. మరి నలుగురు లేదా ఆరుగురు అంపైర్లను ఇలా ఇంగ్లాండ్‌కు రప్పించలేకపోయారా? ఇలా మరో దేశంలో అయితే స్థానిక అంపైర్లను అనుమతించేవాళ్లా?

క్రికెట్​లో ఆధిపత్యం కొనసాగుతోంది..!

నోబాల్స్‌ గుర్తించేందుకు టీవీ అంపైర్‌ను వినియోగిస్తున్నారు. అలాగే తప్పుడు నిర్ణయాల్ని రీప్లే ద్వారా ఎందుకు వెనక్కి తీసుకోకూడదు? ప్రస్తుత సిరీస్‌లో స్థానిక అంపైర్ల తప్పిదాలతో ఇంగ్లాండ్‌ లబ్ధి పొందిన మాట వాస్తవం. అందుకే వేరే దేశాల నుంచి అంపైర్లను రప్పించి ఉండాల్సిందని అంటా. క్రికెట్‌పై ఇంగ్లాండ్‌ ఆధిపత్యం ఇప్పటికీ ఎలా సాగుతోందో చెప్పడానికిది ఉదాహరణ. ఈ విషయంలో నాక్కూడా 'అసూయ' వైరస్‌ సోకినట్లనిపిస్తోంది.

(-- సునీల్‌ గావస్కర్, భారత మాజీ క్రికెటర్​)

ABOUT THE AUTHOR

...view details