తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పుడు నేనో విలన్​లా కనిపించా: యువీ

2014 టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో విఫలమయ్యాక అందరూ తనను విలన్​లా చూశారన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. తన ఇంటిపై రాళ్లు రువ్వారని చెప్పుకొచ్చాడు.

యువరాజ్
యువరాజ్

By

Published : May 13, 2020, 5:05 PM IST

2014 టీ20 ప్రపంచకప్‌ తర్వాత తన ఇంటిపై రాళ్లు రువ్వారని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అన్నాడు. ఫైనల్లో తన పేలవ ఇన్నింగ్స్‌ చూశాక కెరీర్‌ ముగిసినట్టుగానే భావించానని తెలిపాడు. ఓటమితో తానో నేరస్థుడిలా కనిపించానని వెల్లడించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో యువీ 21 బంతులాడి 11 పరుగులే చేశాడు. మెరుపులు మెరిపిస్తాడని భావించిన అతడు విఫలమవ్వడం వల్ల భారత్‌ 130/4కే పరిమితమైంది. లంకేయులు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.

"ఆ ఇన్నింగ్స్‌కు పూర్తి బాధ్యత నాదే. నేను బాగా ఆడలేదు. దురదృష్టవశాత్తు అది ప్రపంచకప్‌ ఫైనల్‌. ఆ ఇన్నింగ్స్‌ మరేదైనా మ్యాచులోనైతే అంత పట్టించుకునేవారు కాదు. ఇంటికి తిరిగొచ్చాక నేనో విలన్‌గా కనిపించా. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే మీడియా నాపై దాడి చేసింది. అరుస్తూ వెంటపడింది. నా ఇంటిపై కొందరు రాళ్లు రువ్వారు. ఎవరినో హత్యచేసి జైలుకు వెళ్లిన నేరస్థుడిలా అనిపించాను. కానీ ఆ తర్వాత పుంజుకున్నాను. ఆరోజు సచిన్‌ ట్వీట్‌ చేయడం గుర్తుంది. ఇంటికి వెళ్లాక నా ఆరు సిక్సర్ల బ్యాటుపై భారత జట్టు టోపీ పెట్టాను. నా కెరీర్‌ ముగిసిందని భావించాను."

-యువరాజ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్​లో ఏ జట్టులోనూ స్థిరంగా లేకపోవడంపై యువరాజ్‌ స్పందించాడు. కింగ్స్‌ XI పంజాబ్‌ నుంచి పారిపోవాలని కోరుకున్నానన్నాడు. "ఒక ఫ్రాంచైజీకి 3-4 ఏళ్లు ఆడే అవకాశం నాకెప్పుడూ రాలేదు. విరాట్‌, ధోనీ, రోహిత్‌ ఒకే ఫ్రాంచైజీకి ఎక్కువ సంవత్సరాలు ఆడారు. ఏదైనా ఆధారం ఉండాలి. లేదంటే నిలబడటం కష్టం. పంజాబ్‌ ఫ్రాంచైజీ నుంచి పారిపోవాలని భావించా. నేను ఏ ఆటగాడిని అడిగినా ఇచ్చేవారు కాదు. ఫ్రాంచైజీ వదిలేశాక నేను అడిగిన వారినే తీసుకోవడం విచిత్రం. పేరుకే నేను సారథిగా ఉన్నాను" అని యువీ కుండబద్దలు కొట్టాడు.

ABOUT THE AUTHOR

...view details