కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్ కన్నా ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని టీమ్‌ఇండియా లెజెండరీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ పునరుద్ధరణ గురించి కాకుండా విద్యార్థుల చదువుల గురించి ఆలోచించాలని సూచించారు.
"నేను విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రికెట్ గురించి మాట్లాడటం సమంజసం కాదు. నేనైతే విద్యార్థుల చదువుల గురించి ఆందోళన చెందుతున్నా. వాళ్లంతా మన భావితరాలు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నేనైతే.. ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని అనుకుంటున్నా. ఆ తర్వాత క్రికెట్, ఫుట్‌బాల్ వాటంతటవే పునఃప్రారంభం అవుతాయి."