డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఓ డేనైట్ టెస్టు ఆడనుంది. అయితే భారత్ కంటే ఆస్ట్రేలియా ఎక్కువ పింక్ బాల్ టెస్టులు ఆడటం తమకు కొంత ప్రయోజనకరంగా మారనుందని అభిప్రాయపడ్డాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఈ టెస్టు భారత బ్యాట్స్మెన్లకు ఛాలెంజింగ్‌గా ఉండబోతోందని అన్నాడు.
ఇప్పటికే డేనైట్ టెస్టు ఆడిన అనుభవం భారత్‌కు ఉందని.. అందులో వారు బాగా ఆడారని తెలిపాడు స్మిత్. కఠినమైన పరిస్థితులకు అనుగుణంగా భారత బ్యాట్స్మెన్లు నిలబడ్డారని వెల్లడించాడు. వాళ్లు ప్రపంచస్థాయి ఆటగాళ్లు కాబట్టి దేనినైనా ఎదుర్కోగలరని.. అందువల్ల ఈ టెస్టు అద్భుతమైన పోటీగా ఉండబోతుందని అభిప్రాయపడ్డాడు.
బంతి మెరుపు కోసం లాలాజలం వాడకూడదనే ఐసీసీ విధించిన నిబంధనపై స్మిత్ స్పందించాడు. బ్యాట్, బంతికి కచ్చితంగా పోటీ అవసరమని.. అయితే ప్రస్తుతం దాని గురించి అంతగా అవగాహన లేదని, కాలమే దానికి సమాధానం చెబుతుందని స్పష్టం చేశాడు.