ఈసారి ఐపీఎల్ వేలంలో అతితక్కువ ధర పలికిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్.. ఈ మెగా ఈవెంట్‌లో ఆడబోడని కంగారూల మాజీ సారథి మైకేల్ క్లార్క్ తేల్చి చెప్పాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు రూ.12.5 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటిది ఈసారి దిల్లీ తరఫున ఆడి కేవలం రూ.2.2 కోట్లు తీసుకుంటాడని అనుకోవడం లేదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా, గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో స్మిత్ పెద్దగా రాణించలేదు. అలాగే ఆ జట్టు కూడా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే అతడిని వదిలేస్తున్నట్లు రాజస్థాన్ జనవరిలో స్పష్టం చేసింది.
ఇక తాజాగా చెన్నైలో జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతడిని తీసుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. దీంతో రూ.2.2 కోట్ల తక్కువ ధరకు దిల్లీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన క్లార్క్.. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో స్మిత్ ఆడడని సందేహం వెలిబుచ్చాడు.