టిమ్‌పైన్ స్థానంలో మరొకరు దొరక్కపోతే స్టీవ్‌స్మిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్ అంటున్నారు. 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో పాత్రధారి అయినప్పటికీ అతడివైపే మొగ్గు చూపొచ్చని అంచనా వేశారు. అతడితో పాటు ప్యాట్ కమిన్స్ రేసులో ముందున్నాడని పేర్కొన్నారు. టీమ్‌ఇండియాతో సిరీసులో కీపింగ్, సారథ్యం, వ్యూహాలపై విమర్శలు రావడం వల్ల టిమ్ పైన్ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
"అవును, బహుశా స్మిత్‌కు మళ్లీ సారథ్యం దక్కొచ్చు. ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నా" అని చాపెల్ అన్నారు. నాయకత్వానికి స్మిత్‌కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్‌కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో వార్నర్ కన్నా స్మిత్ చేసిన నేరమే పెద్దదని చెప్పారు.